ఆంధ్రప్రదేశ్‌లో 20 మార్చ్ 2025న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో (ఎమ్మెల్యే కోటా) తెలుగు దేశం పార్టీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీ.టీ.నాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన నుంచి కొణిదెల నాగబాబు, బీజేపీ నుంచి సోమూ వీర్రాజు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పిఠాపురం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని తెలుగుదేశం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు తెలుగుదేశం జెండాలను తగలబెడుతూ చంద్రబాబు, లోకేష్‌లను అసభ్యంగా దూషించడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పిఠాపురం టీడీపీ నాయకుడు సత్యనారాయణ వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు చంద్రబాబు, లోకేష్‌లను దూషిస్తున్న టీడీపీ కార్యకర్తలు.
ఫాక్ట్: ఇది మార్చి 2024 నాటి వీడియో. పిఠాపురం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించిన తరువాత పిఠాపురంలో టీడీపీ నేత సత్యనారాయణ వర్మ అనుచరులు టీడీపీ, జనసేన పార్టీలకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని మార్చి 2024లో కూడా పలువురు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు గుర్తించాం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో పిఠాపురంలో సత్యనారాయణ వర్మ అనుచరులు నిరసన తెలిపినప్పటి వీడియో అని ఈ పోస్టుల్లో పేర్కొన్నారు.

ఇవే దృశ్యాలను పలు మీడియా సంస్థలు (ఇక్కడ & ఇక్కడ) కూడా ప్రచారం చేశాయి. ఈ కథనాల ప్రకారం, వర్మకి టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం పై ఆయన అనుచరులు ఫ్లెక్సీలను, జండాలను ధ్వంసం చేసి టీడీపీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పై ఆధారాలను బట్టి వైరల్ వీడియో 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్యనారాయణ వర్మకి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడానికి సంబంధించినది కాదని నిర్ధారించవచ్చు.

ఇక ఆశించిన విధంగా తనకి ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై సత్యనారాయణ వర్మ స్పందిస్తూ, కొన్ని సమీకరణాల వల్ల తనకి అవకాశం రాకపోయి ఉండవచ్చని, అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
చివరిగా, పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మకి ఎమ్మెల్సీ టికెట్ రాలేదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మార్చి 2024 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు.