20 ఫిబ్రవరి 2025న ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో, రేఖా గుప్తా పాత వీడియో అంటూ కర్ర సాము, కత్తి సాము చేస్తున్న ఒక మహిళ వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కర్ర సాము, కత్తి సాము చేస్తున్న వీడియో.
ఫాక్ట్: వీడియోలోని మహిళ పేరు పాయల్ జాదవ్. ఆమె మరాఠి నటి, భరతనాట్యం డాన్సర్. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియోని (ఆర్కైవ్) 19 ఫిబ్రవరి 2025న పాయల్ జాదవ్ (@i_mpayal) అనే మరాఠీ నటి యొక్క ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. శివాజీ జయంతి సందర్భంగా తాను ఈ వీడియోలో నటించినట్లు ఆమె వివరణలో పేర్కొన్నారు.
నటి, భరతనాట్యం డాన్సర్ అయిన పాయల్ జాదవ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తను నటించిన సినిమాలు, నాటికలలోని ఫోటోలు, వీడియోలను (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కూడా చూడవచ్చు. ఇక వైరల్ వీడియోలోని మహిళను (పాయల్ జాదవ్) ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పోల్చగా ఇద్దరూ వేరు వేరు మహిళలలని స్పష్టమవుతుంది.

వార్తా కథనాల ప్రకారం, రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం నుంచి వచ్చారు. 1996-97లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నుంచి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 20 ఫిబ్రవరి 2025న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
చివరిగా, వైరల్ వీడియోలో కత్తి సాము చేస్తున్న మహిళ పాయల్ జాదవ్ అనే మరాఠీ నటి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాదు.