Fake News, Telugu
 

సనాతన ధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు సమర్ధించలేదు, పైగా ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టింది

0

గతంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యి, కోర్టులో కేసు కూడా ఫైల్ అయిన విషయం తెలిసిందే. ఐతే ఆ కేసుకి సంబంధించి ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ మద్రాస్ హైకోర్టు ఆ కేసును కొట్టేసిందన్న వార్త ఒకటి ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడిందని ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ గతంలో ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు

ఫాక్ట్(నిజం): సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసినప్పటికీ, విచారణ టైంలో ఎప్పుడు కూడా కోర్టు స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించలేదు, పైగా మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

గతంలో ఉదయనిధి స్టాలిన్ ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిర్వహించిన ‘సనాతన ఒళిప్పు మానాడు’ (సనాతన ధర్మ నిర్మూలన) అనే సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. “కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. వాటిని పూర్తిగా నిర్మూలించాలి. దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తే పోవు, నిర్మూలించాలి. అలాగే సనాతనం కూడా.” అన్నారాయన.

ఈ నేపథ్యంలోనే ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై రిట్ (quo warranto) జారీ చేయాలనీ ఈ పిటిషన్‌లో కోర్టును కోరారు. అప్పటి కార్యక్రమంలో పాల్గొన్న పీకే శేఖర్ బాబు, స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించిన ఎంపీ ఎ. రాజా పేర్లను అందులో చేర్చారు. అయితే విచారణ అనంతరం ఈ కేసులో ఇంతవరకు స్టాలిన్ దోషిగా తేలలేదని గుర్తుచేసిన న్యాయస్థానం ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఐతే కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసిందే కాని విచారణ టైంలో ఎప్పుడు కూడా కోర్టు స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించలేదు, పైగా మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. దీన్నిబట్టి, పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా ఇటీవల స్టాలిన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.

చివరగా, సనాతన ధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు సమర్ధించలేదు, పైగా మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది.

Share.

About Author

Comments are closed.

scroll