ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా వృత్తిరీత్యా మోడల్ అని, ఆమె యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకి సంబంధించి ఎలాంటి పరీక్ష రాయకుండానే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైంది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ఎలాంటి పరీక్ష రాయకుండానే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైంది.
ఫాక్ట్(నిజం): ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE), 2019 యొక్క ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యి ఉత్తీర్ణత సాధించింది. CSE -2019 పరీక్ష తుది ఫలితాల మొదటి జాబితా వచ్చిన ఐదు నెలల తర్వాత UPSC విడుదల చేసిన కన్సాలిడేటెడ్ రిజర్వ్ జాబితాలో ఆమె ఎంపికైంది. అంజలి బిర్లా CSE-2019 పరీక్షకు సంబంధించిన తన అడ్మిట్ కార్డ్, డిటైల్డ్ అప్లికేషన్ ఫారమ్ (DAF)ని అనేక వార్తా సంస్థలకు షేర్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్ 2021 నుండే సోషల్ మీడియాలో ఉంది (ఇక్కడ, & ఇక్కడ ). 2022లో ఇదే క్లెయిమ్ తో పలు పోస్టులు వైరల్ కాగా దాన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
ముందుగా ఈ వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 05 జనవరి 2021న ‘మింట్’ ప్రచురించిన వార్త కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా మొదటి ప్రయత్నంలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE)లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఆధారంగా రూపొందించిన రిజర్వ్ జాబితా నుండి వివిధ సివిల్ సర్వీసెస్ కోసం అంజలితో సహా 89 మంది అభ్యర్థులను ఇటీవల అనగా జనవరి 2021లో కమిషన్ సిఫార్సు చేసిందని ఈ కథనం పేర్కొన్నది.

మేము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వెబ్‌సైట్‌లో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 ఆధారంగా UPSC 04 జనవరి 2021న విడుదల చేసిన 89 మంది రిజర్వ్ అభ్యర్థుల జాబితాలో అంజలి బిర్లా పేరు మరియు ఆమె రోల్ నంబర్ (0851876) ఉన్నట్లు మేము గుర్తించాము.

తదుపరి CSE- 2019 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షా ఫలితాల జాబితాలో అంజలి బిర్లా రోల్ నంబర్‌ను కనుగొన్నాము. దీన్ని బట్టి అంజలి బిర్లా CSE, 2019 యొక్క ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని మనం నిర్థారించవచ్చు.

2021లో అంజలి బిర్లా UPSC ఎంపికైన తరవాత, ఆమె పరీక్షకు హాజరుకాకుండానే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిందంటూ సోషల్ మీడియాలో పుకార్ల వచ్చాయి. ఈ పుకార్ల నేపథ్యంలో అంజలీ బిర్లాని NDTV జనవరి 2021లో ఇంటర్వ్యూ చేసింది. NDTVతో మాట్లాడుతూ, అంజలి బిర్లా ఈ పుకార్లను కొట్టిపారేసింది. అలాగే NDTV అంజలి బిర్లా యొక్క CSE -2019 అడ్మిట్ కార్డ్‌ను కూడా ప్రసారం చేసింది, ఆమె సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019కి హాజరైనట్లు ధృవీకరించింది. అలాగే పలు ఫాక్ట్-చెక్ సంస్థలతో కూడా అంజలి బిర్లా CSE-2019 పరీక్షకు సంబంధించిన తన యొక్క అడ్మిట్ కార్డ్‌ను మరియు డిటైల్డ్ అప్లికేషన్ ఫారమ్ (DAF)ని షేర్ చేసారు (ఇక్కడ & ఇక్కడ).

సివిల్ సర్వీసెస్ పరీక్షను UPSC ఏటా మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ తర్వాత, కమిషన్ సాధారణ అర్హత ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది, ఎటువంటి సడలింపులు లేకుండా కటాఫ్ మార్కులను విజయవంతంగా క్లియర్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తుంది. ఇవి కాకుండా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్‌లోని రూల్ 16 (4) & (5) ప్రకారం , సంబంధిత కేటగిరీల క్రింద చివరిగా సిఫార్సు చేసిన అభ్యర్థి నుండి తదుపరి క్రింద ఉండే అభ్యర్థులో మెరిట్ క్రమంలో కన్సాలిడేటెడ్ రిజర్వ్ జాబితాను నిర్వహిస్తుంది. సంబంధిత CSE యొక్క ప్రధాన ఫలితం విడుదల అయిన ఆరు నెలల తర్వాత కమిషన్ రిజర్వ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలో, ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల సంఖ్య 927, అయితే మొదటి జాబితాలో UPSC ఎంపిక చేసిన అభ్యర్థుల సంఖ్య 829. తరువాత, వివిధ సివిల్ సర్వీసెస్ కోసం 89 రిజర్వ్ జాబితా అభ్యర్థులను కమిషన్ సిఫార్సు చేసింది. CSE 2019కి సంబంధించి సోషల్ మీడియాలో పలు తప్పుదారి పట్టించే పుకార్లు వైరల్ కాగా, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ‘రిజర్వ్ లిస్ట్’ అంటే ఏమిటి మరియు అది ఎలా వర్తింపజేయబడుతుందో స్పష్టం చేస్తూ కమిషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

చివరగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా UPSC నిర్వహించిన CSE-2019 పరీక్ష యొక్క అన్ని పరీక్షలు వ్రాసిన తర్వాతే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైంది.