Fake News, Telugu
 

వైజాగ్‌లోని మహాత్మ గాంధీ కాన్సర్ హాస్పిటల్‌లో వాటా విక్రయానికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు

0

వైజాగ్ గాంధీ హాస్పిటల్‌ని HCG గ్రూప్‌కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. మరో 34% వాటాని రాబోయే 18 నెలల కాలంలో అదే HCG గ్రూప్‌కి 300 కోట్లకి అమ్మడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అంటూ వార్తలు షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్‌లోని గాంధీ హాస్పిటల్‌ని HCG గ్రూప్‌కి 714 కోట్లకి అమ్మేసింది.

ఫాక్ట్(నిజం): హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌(HCG) వైజాగ్‌కు చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (MGCHRI)లో వాటా కొనుగోలు చేసింది. ఐతే MGCHRI అనేది ఒక ప్రైవేట్ సంస్థ. MCA సమాచారం కూడా ఇదే స్పష్టం చేస్తుంది. కాబట్టి  ఇది పూర్తిగా ప్రైవేట్ లావాదేవీ, దీనికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌(HCG) వైజాగ్‌కు చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (MGCHRI)లో వాటా కొనుగోలు చేసిన విషయం నిజమే అయినప్పటికీ దీనికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా రెండు ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన లావాదేవీ.

ఈ విషయానికి సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్ లో వెతకగా ఈ వార్తను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం దేశంలో అతిపెద్ద క్యాన్సర్‌ కేర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ అయిన HCG రూ.414 కోట్ల విలువకు MGCHRIలో 51 శాతం వాటాను కొనుక్కుంది. రాబోయే 18 నెలల్లో మరో 34 శాతం వాటాను చేజిక్కించుకోనుంది.

ఐతే ఈ విక్రయానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ. 1986లో MGCHRIని ప్రారంభించారు. ప్రముఖ ఆంకాలజీ సర్జన్‌ డాక్టర్‌ మురళీ కృష్ణ వూన్న దీని వైజాగ్ యూనిట్‌ను 2005లో ప్రారంభించారు. ఈ హాస్పిటల్ వెబ్‌సైట్‌లో మానేజ్మెంట్‌కు సంబంధించిన సమాచారం కూడా ఇదే స్పష్టం చేస్తుంది.

కాగా ఈ మహాత్మా గాంధీ హాస్పిటల్ MCAలో ‘Vizag Hospital And Cancer Research Centre Pvt Ltd’ అనే లీగల్ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది.  MCAలో ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ అని స్పష్టంగా ఉంది. MCAలో ఉన్న యాజమాన్య సమాచారం కూడా మురళీ కృష్ణ వూన్నా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అని స్పష్టమవుతుంది. ఈ సమాచారం బట్టి ఈ సంస్థ విక్రయానికి ప్రభుత్వంతో ఎలాంటి పనిలేదని స్పష్టమవుతుంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభుత్వం కూడా ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని, దీనికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా వైజాగ్‌లో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ కాన్సర్ హాస్పిటల్ లేదు. 2014లో భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌ను వైజాగ్‌లో ఏర్పాటు చేసారు. ఇది టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) యొక్క యూనిట్. కాగా 2022లో  హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి మరియు విశాఖపట్నంలలో క్యాన్సర్ కేర్ కోసం మూడు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

చివరగా, వైజాగ్‌లోని మహాత్మ గాంధీ కాన్సర్ హాస్పిటల్‌లో వాటా విక్రయానికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll