గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల శాతం ఇలా ఉందంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. అక్షరాస్యతలో బీజేపీ పాలిత రాష్ట్రాలే వెనకబడ్డాయని, మరియు విద్యార్దుల స్మార్ట్ ఫోన్ల వినియోగం కేరళతో పోల్చగా తక్కువగా ఉందన్న డేటాను పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల శాతం.
ఫాక్ట్: భారత ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల శాతంలో గాని, విద్యార్ధుల అక్షరాస్యతలో గాని ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. కేరళ వీటన్నింటి కంటే మెరుగ్గా ఉంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య UDISE+(Unified District Information System for Education Plus) 2019-20 రిపోర్టులో ఉంటుంది. UDISE+ అనేది భారత ప్రభుత్వం వారి డేటాబేస్; దీంట్లో స్కూళ్లకు సంభందించిన డేటా లభిస్తుంది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల శాతం పోస్టులో చెప్పినట్టుగా ఈ రిపోర్టులో లేదు.
కేరళలో అత్యధికంగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు, కానీ అది 69 శాతం మాత్రమే, పోస్టులో చెప్పినట్టు 90 శాతం కాదు. ఈ ఐదు రాష్ట్రాల్లో అతి తక్కువ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది తెలంగాణలో; 42.4 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు, పోస్టులో చెప్పినట్టు 70 శాతం కాదు. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ మరియు కర్ణాటకలో 60.14% మరియు 53.16% గా ఉంది; పోస్టులో చెప్పినట్టు 44.8% మరియు 40.41% కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారు 51.59% కాగా పోస్టులో 70% అని ఉంది.
దేశంలోని వివిధ రాష్రాల్లోని అక్షరాస్యత గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ డేటా ఉంది. దాదాపు పది ఏండ్ల క్రితం చేసిన Census డేటా 2011లో కూడా అక్షరాస్యతకు గురించి తెలుస్తుంది. కానీ, నేషనల్ శాంపిల్ సర్వే 75th రౌండ్ (2017-18)లో అక్షరాస్యతకు సంబంధించిన డేటా విడుదల చేసారు. దీనిని పరిగణలోకి తీసుకుని డేటాను పోల్చగా, అక్షరాస్యతలో బీజేపీ పాలిత రాష్ట్రాలే వెనకబడ్డాయన్న దాంట్లో వాస్తవం లేదు.
ఐదు రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ యొక్క అక్షరాస్యత చూస్తే, కేరళ 96.2%తో మొదట్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 66.4 శాతంతో చివర్లో ఉంది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ మరియు కర్ణాటకలో అక్షరాస్యత శాతం 82.4 మరియు 77.2 ఉంది; తెలుగు రాష్ట్రాలకంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు చూడొచ్చు.
విద్యార్దుల స్మార్ట్ ఫోన్ల వినియోగం గురించి ఎటువంటి అధికారిక డేటా ప్రభుత్వం సేకరించినట్టు మాకు లభించలేదు. ఇటీవల చేసిన ASER సర్వే ప్రకారం, కేరళలో 97.5%, ఉత్తరప్రదేశ్ లో 58.9%, బీహార్ లో 54.4% విద్యార్దుల ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు తెలిపారు. కానీ, ఆ సర్వేలోనే, స్మార్ట్ ఫోన్ ఇంట్లో ఉన్నంత మాత్రాన పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని అర్థం కాదని తెలిపారు.
కోవిడ్ తర్వాత కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తుంది. రాష్ట్రాల డేటా ప్రకారం, గుజరాత్ లో 2.82 లక్షల మంది విద్యార్థులు, ఢిల్లీలో 1.58 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణలో 1.25 లక్షల మంది 2021-22 విద్యా సంవత్సరంలో ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. హర్యానాలో 2 లక్షలు, మధ్యప్రదేశ్ లో 1.29 లక్షలు (ఏప్రిల్-సెప్టెంబర్ 2021), పంజాబ్ లో 1.85 లక్షలు. అయితే, 2021-22లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఎంత మంది చేరారు అన్న కచ్చితమైన సమాచారం ఇప్పటికి అందుబాటులో లేదు.
చివరగా, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల శాతం గాని, అక్షరాస్యత గాని బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటకలో తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ.