‘రేప్ లు తరతరాలుగా జరుగుతునే వున్నాయి.. వాటిని మేము ఆపలేము.. అవి మా సంస్కృతిలో ఒక భాగం’ అని బీజేపీ నాయకురాలు కిరణ్ ఖేర్ అన్నారని ఫేస్బుక్ లో కొంతమంది పోస్టు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: బీజేపీ నాయకురాలు కిరణ్ ఖేర్- ‘రేప్ లు తరతరాలుగా జరుగుతునే వున్నాయి.. వాటిని మేము ఆపలేము. అవి మా సంస్కృతిలో ఒక భాగం’.
ఫాక్ట్ (నిజం): కిరణ్ ఖేర్ పోస్టులోని వ్యాఖ్యలు చేయలేదు, ఆమె మాటలు వక్రీకరించబడ్డాయి. ప్రజల మనస్తత్వాన్ని మార్చడం ద్వారా అత్యాచారాలను ఆపవచ్చని ఆమె అన్నారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
ఇటీవల బీజేపీ నేత రఘునందన్ తనను రేప్ చేసాడని ఒక మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసిందని ‘Asianet’ కథనం ద్వారా తెలుస్తుంది. దాంతో, ఆ పార్టీ నాయకురాలు కిరణ్ ఖేర్ రేప్ ల గురించి చేసినట్లుగా ఉన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలామణి అవుతున్నాయి.
కిరణ్ ఖేర్ పోస్టులోని వ్యాఖ్యలు చేసారా అని వెతికినప్పుడు, ‘ANI’ వారి ఒక కథనం లభించింది. ఆ కథనం ప్రకారం, కిరణ్ ఖేర్ 2018 లో హర్యానాలో జరుగుతున్న రేప్ ల గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసారు- ‘ఇలాంటి సంఘటనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మనస్తత్వాన్ని మార్చడం ద్వారా పరిస్థితిలో మార్పును తీసుకొని రావొచ్చు. సమాజంలో మార్పు అనేది ఒక కుటుంబం నుండే మొదలవుతుంది’. 2018 లో హర్యానాలో జరుగుతున్న రేప్ ల గురించి కిరణ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు ‘Times of India’ వారి వీడియో లో వినవచ్చు. ‘రేప్ లు తరతరాలుగా జరుగుతునే వున్నాయి.. వాటిని మేము ఆపలేము.. అవి మా సంస్కృతిలో ఒక భాగం’ అని ఖేర్ అనలేదు. మనస్తత్వ మార్పు తేవడం వల్ల మరియు కుటుంబంలో మహిళలకి సమాన స్థితిని ఇవ్వడం వల్ల రేప్ లని ఆపవచ్చని ఆమె అన్నారు.
చివరిగా, కిరణ్ ఖేర్ పోస్టులోని వ్యాఖ్యలు చేయలేదు, ఆమె మాటలు వక్రీకరించబడ్డాయి.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?