Fake News, Telugu
 

రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ గుర్తుపైనే పోటీ చేస్తుందని ఎలాంటి ప్రకటన చేయలేదు

0

రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ గుర్తుపైనే పోటీ చేస్తుందని చెప్తూ సోషల్ మీడియాలో జనసేన అధికారిక ప్రెస్ నోట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతోంది. రాష్ట్ర స్థాయి పార్టీ హోదా లేకపోవడం వలన, కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయడం మొదలైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు షేర్ అవుతున్నాయి. లేదా జనసేన నుండి అభ్యర్థులను నిలపకుండ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది అని కూడా ఈ ప్రకటనలో ఉంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ గుర్తుపైనే పోటీ చేస్తుందని జనసేన అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ఫాక్ట్(నిజం):  రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ గుర్తుపైనే పోటీ చేస్తుందని ఎటువంటి ప్రకటన/ప్రెస్ నోట్ విడుదల చేయలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్నది డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. కాగా ఎన్నికల కమిషన్ మొదట జనసేన గ్లాస్ గుర్తు రద్దు చేసినప్పటికీ, మళ్ళీ తిరిగి అదే గుర్తును కేటాయించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలులో పరామర్శించిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తుందని ప్రకటించాడు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ గుర్తుపైనే జనసేన పోటీ చేస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు షేర్ అవుతున్నాయి. కాని ఇప్పటివరకైతే జనసేన అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ప్రస్తుతం జనసేన పేరుతో షేర్ అవుతున్న ప్రెస్ నోట్ డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు.

ప్రస్తుతం షేర్ అవుతున్న ప్రెస్ నోట్‌లో తేదీ 15 సెప్టెంబర్ 2023 అని  ఉంది. కాని ఈ రోజు జనసేన కేవలం ఒకటే ప్రెస్ నోట్ విడుదల చేసింది, అది కూడా మంగళగిరిలో జరిగే పార్టీ విస్త్రుత స్థాయి సమావేశానికి సంబంధించింది (ఇక్కడ). ఈ ప్రెస్ నోట్‌లో ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. పైగా ఈ రోజు విడుదల చేసిన ప్రెస్ నోట్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరు మీద విడుదలైంది, కాని వైరల్ అవుతున్న నోట్ నాదెండ్ల మనోహర్ పేరు మీద ఉంటుంది.

దీన్నిబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రెస్ నోట్‌ను డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించినట్టు స్పష్టమవుతుంది. ఒకవేళ నిజంగానే జనసేన ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని అలాంటి రిపోర్ట్స్ ఏవి మాకు కనిపించలేదు.

ఇదిలా ఉంటే  2019 ఎన్నికల్లో అవసరమైన ఎనిమిది శాతం ఓట్లను సాధించడంలో పార్టీ వైఫల్యం కావడంతో మే 2023లో ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీ గుర్తైన గ్లాస్‌ గుర్తును తొలగించి, ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చింది. కాని తిరిగి జూన్ 2023లో జనసేన పార్టీకి గ్లాస్‌ గుర్తును కేటాయించింది. కాబట్టి గ్లాస్ గుర్తును రద్దు కావడం కూడా ఒక కారణం అంటూ చేస్తున్న వాదన కూడా తప్పని స్పష్టమవుతుంది.

చివరగా, రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ గుర్తుపైనే పోటీ చేస్తుందని ఎటువంటి ప్రకటన చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll