Fake News, Telugu
 

జవహర్‌లాల్ నెహ్రూ తన భార్య అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదన్న వార్తలో నిజం లేదు

0

‘టీబీ తో బాధపడుతున్న తన భార్యని నెహ్రూ పట్టించుకోలేదని; ఈ విషయం తెలిసి సుభాష్ చంద్ర బోస్ తనని స్విట్జర్లాండ్ లోని హాస్పిటల్ లో జాయిన్ చేసాడని; తను చనిపోయాక అంత్యక్రియలకు కూడా నెహ్రూ రాకపోతే బోసే అంత్యక్రియలను నిర్వహించాడని’, ఇలా పలు క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నెహ్రూ టీబీతో బాధపడుతున్న తన భార్యని పట్టించుకోలేదు, తను చనిపోయినాక అంత్యక్రియలకు కూడా నెహ్రూ రాకపోవడంతో సుభాష్ చంద్ర బోస్ అంత్యక్రియలు నిర్వహించాడు.

ఫాక్ట్ (నిజం): టీబీతో బాధపడుతున్న తన భార్య కమలని నెహ్రూ1926లో స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. తిరిగి 1935లో ఆమె వైద్యం కోసం యూరోప్ వెళ్ళిన సమయంలో నెహ్రూ జైలులో ఉండడంతో యూరోప్ లోనే ఉన్న సుభాష్ చంద్రబోస్ నెహ్రూ వచ్చే వరకు ఆమెకి తోడుగా ఉన్నాడు. చివరికి 1936లో కమలా నెహ్రూ, బోస్ మరియు ఇందిర సమక్షంలో చనిపోయారు. అప్పుడు అంత్యక్రియల వ్యవహారాలలో బోస్ సహాయం చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

జవహర్‌లాల్ నెహ్రూ జైలులో ఉన్న సమయంలో తన సోదరి విజయ లక్ష్మి పండిట్ కి రాసిన లెటర్స్ ఆధారంగా కృష్ణ నెహ్రూ హుతీసింగ్ ‘నెహ్రు లెటర్స్ టు హిస్ సిస్టర్’ అనే పుస్తకం రాసారు. ఈ పుస్తకంలో చెప్తున్నదాని ప్రకారం, జవహర్‌లాల్ నెహ్రూ టీబీతో బాధపడుతున్న తన భార్య కమలాని చికిత్స కోసం 1926లో స్విట్జర్లాండ్ కి తీసుకెళ్ళి, ఆమె కొంత కోలుకున్నాక తిరిగి ఇండియాకి వచ్చినట్టు తెలుస్తుంది.

టైమ్స్ అఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం 1935లో 10 మార్చి నుండి 15 మే వరకు  కమలాని నైనిటాల్ దగ్గరలోని భోవాలి ప్రాంతంలోని ఒక సానిటోరియం లో చేర్చి చికిత్స అందించారని,  ఈ సమయంలో నెహ్రూ తనను చూడడానికి వచ్చేవాడని తెలుస్తుంది. దీన్నిబట్టి, టీబీతో బాధపడుతున్న తన భార్యని నెహ్రూ పట్టించుకోలేదన్న వార్త కల్పితం అని అర్ధం చేసుకోవచ్చు.

టీబీ తీవ్రం కావడంతో కమలాని భోవాలిలోని సానిటోరియం నుండి యూరోప్ తరలించారు, ఐతే ఈ సమయంలో నెహ్రూ అల్మోర జైలులో ఉండడంతో, యూరోప్ లోనే ఉన్న సుభాష్ చంద్ర బోస్ కమలాని వియన్నా నుండి చికిత్స కోసం ప్రేగ్ తరలించినప్పుడు ఆమెకు తోడుగా వెళ్ళాడు. ఈ మధ్యలో కమలా పరిస్థితి క్షీణించడంతో, బ్రిటిష్ వారు నెహ్రూకి తన భార్యని కలుసుకోవడానికి  అనుమతించారు. అప్పటికే ఆమెని జర్మనీలోని బాడెన్వీలర్ కి తరలించడంతో నెహ్రూ అక్కడికి చేరుకున్నాడు. నెహ్రూ వచ్చే వరకు బోస్ కమలాకి తోడుగా ఉన్నాడు.

స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌ లో చికిత్స పొందుతూ 28 ఫిబ్రవరి 1936న నెహ్రూ, కుమార్తె ఇందిరా మరియు బోస్ సమక్షంలో కమలా చనిపోయారు. ఆ సమయంలో కమలా అంత్యక్రియలకి సంబంధించిన వ్యవహారాలలో సుభాష్ చంద్ర బోస్ సహాయం చేసాడు. వీటన్నిటి బట్టి నెహ్రూ భార్య చికిత్స మరియు అంత్యక్రియల విషయంలో బోస్ సహాయం చేసిన మాట నిజమైనప్పటికీ, నెహ్రూ తన భార్యని పట్టించుకోలేదన్న వార్త నిజం కాదని అర్ధంచేసుకోవచ్చు. పైగా సుభాష్ చంద్ర బోస్ కమల వైద్యానికి డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేసాడని చెప్పడానికి మాకు ఆధారాలు దొరకలేదు.

చివరగా, జవహర్‌లాల్ నెహ్రూ తన భార్య అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll