Fake News, Telugu
 

గతంలో జరిగిన వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సాధించిన మెజారిటీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సాధించిన మెజారిటీతో పోల్చడం సరైనది కాదు

0

ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA) కూటమి 293 సీట్లను గెలుచుకుంది, 09 జూన్ 2024న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ వారణాసిలో 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రధానమంత్రులుగా వివిధ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నరేంద్ర మోదీ కంటే తక్కువ మెజారిటీతో గెలిచారు అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గతంలో ప్రధానమంత్రులుగా వివిధ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ కంటే తక్కువ మెజారిటీతో గెలిచారు.

ఫాక్ట్(నిజం): గతంలో వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు వచ్చిన మెజారిటీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వచ్చిన మెజారిటీతో పోల్చడం సరైనది కాదు. గతంలో జరిగిన వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పోటీ చేసిన వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం ఓటర్లు సంఖ్య ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్లు సంఖ్య కంటే చాలా తక్కువ. 1960లతో పోల్చుకుంటే మెజారిటీ లోక్ సభ నియోజికవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కావున నరేంద్ర మోదీ కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో వీరు గెలిచారు అని పోల్చడం సరైనది కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల విడుదలైన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గత 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గింది.

పోస్టులో తెలిపినట్టుగా గతంలో ప్రధానమంత్రులుగా వివిధ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నరేంద్ర మోదీ కంటే తక్కువ మెజారిటీతో గెలిచారా? అనే విషయంపై భారత ఎన్నికల సంఘం (ECI) వెబ్‌సైట్‌ని సందర్శించి, అక్కడ భారత ఎన్నికల సంఘం పబ్లిష్ చేసిన వివిధ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మేము పరిశీలించాము (ఇక్కడ & ఇక్కడ). భారతదేశంలో జరిగిన వివిధ సాధారణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర ఫలితాలు(స్టాటిస్టికల్ రిపోర్ట్స్) DATAFUL యొక్క ఈ డేటాసెట్‌లో చూడవచ్చు .

ముందుగా 1957 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొన్ని అంశాలను మన౦ గుర్తించాలి. మొదటి రెండు సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో అనగా 1962 లోక్‌సభ సాధారణ ఎన్నికల వరకు మన దేశంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు MP అభ్యర్థులను ఎనుకొన్నేవారు. అంటే అక్కడి ఓటర్లు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసేవారు. స్వాతంత్య్రానంతరం జరిగిన మొదటి రెండు ఎన్నికలలో, దేశంలోని ప్రతి ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒకదానిలోని ఓటర్లు తమకు ప్రాతినిధ్యం వహించడానికి కేవలం ఒక ఎంపీని మాత్రమే కాకుండా ఇద్దరిని ఎంచుకోవలసి వచ్చింది. 1951-52లో మధ్యకాలంలో భారతదేశం యొక్క మొదటి సాధారణ ఎన్నికలు 26 రాష్ట్రాలలో 400 నియోజకవర్గాలలో జరిగాయి. వీటిలో, 314 నియోజకవర్గాలు ఒక్కొక్క ఎంపీని ఎన్నుకున్నాయి, అయితే 86 నియోజకవర్గాలు సాధారణ(జనరల్) మరియు షెడ్యూల్డ్ కులాల నుండి ఒక్కొక్కరిని – ఇద్దరిని ఎన్నుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని, ఉత్తర బెంగాల్ అనే నియోజకవర్గం సాధారణ(జనరల్), షెడ్యూల్డ్ తెగల మరియు షెడ్యూల్డ్ కులాల నుండి ఒక్కొక్కరిని – ముగ్గురు ఎంపీలను ఎన్నుకుంది. ఈ బహుళ-సీట్ల నియోజకవర్గాలు అణగారిన వర్గాలకు – దళితులు మరియు గిరిజన వర్గాలకు రిజర్వ్ చేయడానికి సృష్టించబడ్డాయి. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం 489 పార్లమెంట్ సీటులకు అభ్యర్థులను ఎన్నుకున్నారు. 1957లో  జరిగిన రెండోవ సాధారణ ఎన్నికలు మొత్తం 403 నియోజకవర్గాలలో జరిగాయి. వీటిలో, 312 నియోజకవర్గాలు ఒక్కొక్క ఎంపీని ఎన్నుకున్నాయి, అయితే 91 నియోజకవర్గాలు సాధారణ(జనరల్) మరియు షెడ్యూల్డ్ కులాల నుండి ఒక్కొక్కరిని – ఇద్దరిని ఎన్నుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 494 పార్లమెంట్ సీటులకు అభ్యర్థులను ఎన్నుకున్నారు. 1961లో The Two-Member Constituencies (Abolition) Act, 1961 ద్వారా ఇలా ఇద్దరు MPలు గల పార్లమెంట్ నియోజకవర్గాలను రద్దు చేసారు (ఇక్కడ & ఇక్కడ).

1957 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇద్దరు MP అభ్యర్థులు ఎన్నుకోబడ్డారు. అందులో జవహర్‌లాల్ నెహ్రూకు అత్యధికంగా 227448 ఓట్లు వచ్చాయి. రెండవ MPగా గెలిచిన మసూరియా దిన్ కు 198430 ఓట్లు వచ్చాయి. వీరిదరి మధ్య 29,018 ఓట్ల అంతరం ఉంది. దీన్నే ఈ పోస్టులో 1957 లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూకు వచ్చిన మెజారిటీగా పేర్కొన్నారు. ఐతే ఇది జవహర్‌లాల్ నెహ్రూకు వచ్చిన మెజారిటీ కాదు.

ఇకపోతే పోస్టులో పేర్కొన్నట్లే 1962 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలిచిన జవహర్‌లాల్ నెహ్రూకు 64,571 ఓట్ల మెజారిటీ వచ్చింది, 1967 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలిచిన ఇందిరా గాంధీకి 91,703 ఓట్ల మెజారిటీ వచ్చింది, 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలిచిన ఇందిరా గాంధీకి 1,11,810 ఓట్ల మెజారిటీ వచ్చింది, 1977 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఇందిరాగాంధీ ఈ ఎన్నికలలో 55,202 ఓట్ల తేడాతో రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. పోస్టులో పేర్కొన్న ఈ అంశాలని నిజం అయినప్పటికీ , ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.

గతంలో జరిగిన వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పోటీ చేసిన వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం ఓటర్లు సంఖ్య ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్లు సంఖ్య కంటే చాల తక్కువ,  కావున మనం ఇలా నరేంద్ర మోదీ కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో వీరు గెలిచారు అని చెప్పలేము. 1960లతో పోల్చుకుంటే మెజారిటీ లోక్ సభ నియోజికవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటువంటివి పోల్చేటప్పుడు ఒక వ్యక్తికి వచ్చిన మెజారిటీని పోలైన ఓట్ల శాతం రూపంలో చూడడం సరైన పోలిక అవుతుంది.

ఈ విధంగా వచ్చిన మెజారిటీని ఓట్ల శాతంతో చూడగా, 1962 లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ 33.36% ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1957 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ 35.24% ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1967 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ 40.47% ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీపై  రాజ్ నారాయణ్ 16.62% ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే ప్రధాని మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో వదోదర స్థానం నుండి 49.08% ఓట్ల మెజారిటీతో, వారణాసి స్థానం నుండి 36.14% ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వారణాసి స్థానం నుండి 45.39% ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వారణాసి స్థానం నుండి 13.50% ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గింది.

భారతదేశంలో జరిగిన వివిధ సాధారణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర ఫలితాలు(స్టాటిస్టికల్ రిపోర్ట్స్) DATAFUL యొక్క ఈ డేటాసెట్‌లో చూడవచ్చు. వివిధ ఎన్నికల్లో పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ , నరేంద్ర మోదీలకు వచ్చిన ఓట్లు, మెజారిటీకి సంబధించిన వివరాలను క్రింద చూడవచ్చు.

చివరగా, గతంలో జరిగిన వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సాధించిన మెజారిటీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సాధించిన మెజారిటీతో పోల్చడం సరైన పోలిక కాదు, ఎందుకంటే 1960లతో పోల్చుకుంటే మెజారిటీ లోక్ సభ నియోజికవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll