Fake News, Telugu
 

‘హలాల్’ గుర్తింపు పొందడానికి ఈ పోస్ట్‌లో పేర్కొన్నవన్నీ చేయవలసిన అవసరం లేదు

0

“MTR కంపెనీ ‘హలాల్ సర్టిఫికేషన్’లోకి ప్రవేశించింది, అంటే ఆ కంపెనీ ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో 25% మంది ఇస్లాం పాటించే ఉద్యోగులు ఉండాలి, మరియు వారు తయారు చేసే ఆహార పదార్ధాలలో ఉమ్మి వేసి దానిని దేవుడి ప్రసాదంగా భావిస్తారు. కావున హిందువులందరూ ఈ వీటితో జాగ్రత్తగా ఉండటం మంచిది” అని చెప్తూ  ‘హలాల్’ లేబుల్ కలిగిన  MTR ఇడ్లీ రవ్వ పాకెట్ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: MTR కంపెనీ ‘హలాల్ సర్టిఫికేషన్’లోకి ప్రవేశించింది, అంటే ఆ కంపెనీ ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో 25% మంది ఇస్లాం పాటించే ఉద్యోగులు ఉండాలి, మరియు వారు తయారు చేసే ఆహార పదార్థాలలో ఉమ్మి వేసి దానిని దేవుడి ప్రసాదంగా భావిస్తారు.

ఫాక్ట్: ఫోటోలో ఉన్న ఇడ్లీ రవ్వ పాకెట్ కెనడా దేశానికి చెందినది. కొన్ని ఇస్లాం మెజారిటీ దేశాలలో అమ్మే ఉత్పత్తులకు ‘హలాల్’ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. భారత్ లో హలాల్ గుర్తింపు అనేది తప్పనిసరి కాదు. అందుకే, కంపెనీలు కూడా వేరే దేశాలలో ఉన్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ‘హలాల్’ గుర్తింపు ఉన్న తమ సరుకులను అమ్ముతాయి. ఇక ‘హలాల్’ గుర్తింపు రావాలి అంటే ఆహారంలో ఉమ్మి వేయాలి అని ఎక్కడా లేదు. మాంసాహార ఉత్పత్తులకి హలాల్ గుర్తింపు రావాలి అంటే వాటిని చంపే వ్యక్తి ముస్లిం అయ్యి ఉండాలి కానీ, శాకాహార ఉత్పత్తులకి అటువంటి నియమమేమి లేదు. కావున ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా పోస్టులో ఉన్న ఫోటోని గమనిస్తే ఇది భారత్ కు చెందిన కంపెనీయే అయినప్పటికీ, పాకెట్ పైన కెనడాకి చెందిన సంస్థ దిగుమతి చేసుకున్నట్లు చూడవచ్చు. అరబ్ దేశాలలో ఆహార పదార్ధాలను బయటి దేశాలనుంచి అనుమతించాలి అంటే ‘హలాల్’ గుర్తింపు తప్పనిసరి. అలాగే కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా ముస్లిం వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ‘హలాల్’ గుర్తింపుతో తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి. భారత్ లో కూడా ఈ గుర్తింపు తప్పనిసరి కాదు.

ఇక ‘హలాల్’ అంటే ఇస్లాం మత గ్రంధాల ప్రకారం, అరబిక్ భాషలో ‘అనుమతించదగినది’ అని అర్ధం. అంటే ఇస్లాం మత ఆచారాల ప్రకారం ఇస్లాంను పాటించే వారికి కొన్ని ఆహార పదార్ధాలను తినడం లేదా కొన్ని ప్రక్రియలు చేయడానికి అనుమతి ఉంటుంది. వీటినే ‘హలాల్’ అంటారు. అలాగే కొన్ని ఆహార పదార్ధాలను తినడానికి లేదా కొన్ని పనులు చేయడానికి అనుమతి ఉండదు అని భావిస్తారు. దీనిని ‘హరాo’ అంటారు. అంటే ‘నిషేదించబడినది’ అని అర్థం. హలాల్ అనేది కేవలం ఆహార పదార్ధాల్లోనే కాకుండా వివిధ రంగాలలో చూడవచ్చు. ఉదాహరణకు హలాల్ టూరిజం, హలాల్ మెడిసిన్, హలాల్ మీడియా, హలాల్ కోసమేటిక్స్. అయితే పోస్టులోని విషయం ఆహార పదార్ధనికి సంబంధించినది కాబట్టి దాని గురించి చూద్దాం.

Halal Monitoring Committee, UK’, Food and Agriculture Organization ప్రకారం ఈ క్రింద ఇచ్చిన జంతువులు ముస్లిములు తినదగినవి (హలాల్):

అయితే చెప్పిన వాటిల్లో చేపలు మరియు మిడతలు తప్ప మిగిలిన వాటిని ఈ క్రింది ఇచ్చిన నియమాలను బట్టి చంపితేనే అవి తినడానికి అనుమతించబడతాయి (హలాల్).

  • వాటిని చంపే వ్యక్తి ఇస్లాం మతస్తుడు అయ్యి ఉండాలి.
  • చంపే ముందు అతను “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” లేదా “ బిస్మిల్లాహ్” అని చెప్పాలి.
  • ఇలా చెప్పిన వెంటనే జంతువుని చంపాలి.
  • అతను వాడే కత్తి పదునుగా ఉండేలా చూసుకోవాలి. అందువలన   మరియు జంతువు తక్కువ నొప్పితో త్వరగా మరణిస్తుంది.
  • జంతువు యొక్క శ్వాస నాళము (trachea), అన్న వాహిక (oesophagus), గొంతు నరాలు (jugular veins) మొదలగు వాటిని కత్తితో ఒకేసారి చేయి పైకి ఎత్తకుండా ‘ఆడమ్స్ ఆపిల్’ కింద  కోయవలసి ఉంటుంది.
  • ఇలా చేసిన తర్వాత జంతువు శరీరం నుంచి రక్తం పూర్తిగా బయటకు పోవాలి.

పై విధంగా ఉత్పత్తి చేసిన మాంసాహారాన్ని ‘హలాల్’ గా భావిస్తారు. పైన చెప్పిన నియమాలలో ఎక్కడా కూడా ఆహారంలో ఉమ్మి వేయడం లేదా మూత్ర విసర్జించడం చేయాలని లేదు. ఇటువంటి ఆరోపణలే 2021లో కూడా వచ్చినప్పుడు మేము వాటిని ఫాక్ట్-చెక్ చేసి అది అవాస్తవం అని నిర్దారించాము. దానిని ఇక్కడ చూడవచ్చు.

ఇక శాకాహార పదార్ధాలకు (ఉదాహరణకు వైరల్ ఫోటో లో ఉన్న ఇడ్లీ రవ్వ), అందులో ఎటువంటి మద్యం, మాదక ద్రవ్యాలు, రక్తం వంటి పదార్ధాలు కలవకుండా ఉంటే వాటిని ‘హలాల్’ గా భావిస్తారు. అయితే శాకాహార పదార్ధాలను ఉత్పత్తిలో పని చేసే వ్యక్తి ముస్లిం అవ్వాల్సిన  అవసరం లేదు.

Deccan Herald’ లో వచ్చిన కథనం ప్రకారం, గల్ఫ్ దేశాలలో అక్కడి ప్రభుత్వాలే వివిధ కంపెనీల ఉత్పత్తులకి హలాల్ గుర్తింపును ఇస్తాయి. భారత్లో అయితే తమ ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు కావాలి అనుకునే  కంపెనీలు కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా ఈ గుర్తింపులను పొందుతాయి. ‘The Scroll’ వచ్చిన కథనం ప్రకారం, దేశంలో లో అనేక పెద్ద కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు కూడా ‘హలాల్ గుర్తింపు ఉంది. ఇక ఈ ఏడాది మార్చిలో హలాల్ గుర్తింపు ఉంది అని Himalaya కంపెనీ కి చెందిన ఉత్పత్తులని నిషేధించాలి అని ఆరోపణలు రాగా, ఇదే విషయమై ‘Himalaya’ కంపెనీ వారు ఇచ్చిన వివరణను ఇక్కడ చూడవచ్చు.

అంతే కాదు, 2020లో ఇటువంటి ఆరోపణలే బాబా రాందేవ్ వారి పతంజలిపై వచ్చినప్పుడు, ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ పతంజలి ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్నది గల్ఫ్ దేశాలకు వాటిని ఎగుమతి చేయడానికి అని, మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి కాదు అని స్పష్టం చేసారు.

చివరిగా, ఫోటోలో ఉన్న ‘MTR’ ఇడ్లీ రవ్వ పాకెట్ కెనడా దేశం దిగుమతి చేసుకున్న వస్తువు. భారత్ లో హలాల్ గుర్తింపు తప్పనిసరి కాదు. మరియు హలాల్ గుర్తింపు ఇవ్వాలి అంటే ఆహారంలో ఉమ్మి వేయడం అనే నియమం ఎక్కడా లేదు.

Share.

About Author

Comments are closed.

scroll