ముస్లింలకు ఇండోర్ కలెక్టర్ హెచ్చరిక అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలోని వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేయకూడదని, చేసిన వారిని చట్ట పరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలకు వ్యతిరేకంగా ఇండోర్ కలెక్టర్ హెచ్చరిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో దేశ వ్యతిరేక నినాదాలకు వ్యతిరేకంగా ముస్లింలను హెచ్చరిస్తున్నది మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ. పైగా ఈ ఘటన 2021లో జరిగింది. ప్రస్తుత ఇండోర్ కలెక్టర్‌కు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తున్న ఈ వీడియో పాతది. అలాగే వీడియోలో హెచ్చరిస్తున్న వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధి, కలెక్టర్ కాదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను 2021లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఐతే ఈ రిపోర్ట్ ప్రకారం వీడియోలో ముస్లింలను హెచ్చరిస్తూ కనిపించేది మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ.
అంతకు ముందు ఉజ్జయినిలో దేశ వ్యతిరేక నినాదాలు (పాకిస్థాన్ జిందాబాద్) చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర శర్మ ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ అంశాన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ కూడా చేసాయి. ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇకపోతే ప్రస్తుతం డా. ఇళయరాజా ఇండోర్ కలెక్టర్‌గా ఉన్నారు. ఐతే వైరల్ వీడియోకు, ప్రస్తుత ఇండోర్ కలెక్టర్‌కు ఎటువంటి సంబంధం లేదు. కలెక్టర్ ఫోటోను, వైరల్ వీడియోలోని వ్యక్తి ఫోటోను పోల్చినప్పుడు ఈ విషయం స్పష్టంగా ఆర్దమవుతుంది.
చివరగా, ఈ వీడియోలో ముస్లింలను హెచ్చరిస్తున్నది మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ, ఇండోర్ కలెక్టర్ కాదు,