Fake News, Telugu
 

75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారత ప్రభుత్వం ఎలాంటి ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించలేదు

0

“భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది”  అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, ఈ వార్తలో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫాక్ట్ (నిజం): 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 01 ఏప్రిల్ 2021 నుండి, కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలు చేయవలసిన అవసరం లేకుండా, సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇచ్చారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి సంవత్సరానికి రూ. 3 లక్షలగా నిర్ణయించబడింది, అలాగే 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా మేము వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పే ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. పైగా ఇటీవల లోకసభలో సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీని అందించే పన్ను సవరణలను ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందా అని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ, “బడ్జెట్ ప్రక్రియలో భాగంగా, ఆదాయపు పన్ను చట్టం, 1961లో సవరణల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ ప్రతిపాదనలను స్వీకరిస్తుంది మరియు అలాంటి ప్రతిపాదనలపై మంత్రిత్వ శాఖ చర్చిస్తుందని. అయితే, ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు” అని తెలిపినట్లు పేర్కొన్న పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ).

ఇకపోతే వైరల్ క్లెయింకు సంబంధించిన మరింత సమాచారం కోసం, సీనియర్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్ల పన్ను స్లాబ్‌లను అర్థం చేసుకోవడానికి మేము ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ని పరిశీలించాము. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, పెన్షన్‌ల ద్వారా వచ్చే ఆదాయంతో సహా ₹3 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన సీనియర్ సిటిజన్లు (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కానీ 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) కొత్త మరియు పాత పన్ను విధానాలలో ఆదాయపు పన్ను చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే, ₹3 లక్షల కంటే ఎక్కువ సంపాదించే సీనియర్ సిటిజన్లు వారికి వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ మరియు పాలన ఆధారంగా తప్పనిసరిగా పన్నులు చెల్లించాలి అని తెలుస్తుంది.

అదేవిధంగా, సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు), పెన్షన్‌ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో సహా వార్షిక ఆదాయం పాత పన్ను విధానంలో ₹5 లక్షలు వరకు మరియు కొత్త పన్ను విధానంలో ₹3 లక్షల కంటే తక్కువ ఉంటే పన్ను చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే, ఈ మొత్తాల కంటే ఎక్కువ సంపాదించే సూపర్ సీనియర్ సిటిజన్లకు వారికి వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ఆధారంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు వర్తించే పన్ను తగ్గింపులు మరియు ప్రయోజనాల గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

01 ఏప్రిల్ 2021 నుండి ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 194P ప్రకారం, కేవలం పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న 75 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలు చేయవలసిన అవసరం లేకుండా, సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇచ్చారు.

ఈ సమాచారం బట్టి సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి సంవత్సరానికి రూ. 3 లక్షలగా నిర్ణయించబడింది, అలాగే 80 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారత నివాసితులైన సూపర్ సీనియర్ సిటిజన్లుకు వార్షిక మొత్తం ఆదాయం రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు లేదా రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు అని తెలుస్తుంది.

అలాగే ఈ వైరల్ పోస్టులపై స్పందిస్తూ, భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 28 నవంబర్ 2024న తన అధికారిక ఫాక్ట్-చెకింగ్ X (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ వార్త అవాస్తవమని స్పష్టం చేసింది. అలాగే వారికి సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఆదాయాలపై టాక్స్ మినహాయింపు ఉంటుందో కూడా ట్వీట్‌లో వివరంగా చెప్పింది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు, పెన్షన్ సహా వడ్డీ ఆదాయంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194P కింద ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉందని, ఒకవేళ వారికి పన్నులు వర్తిస్తే, ఆదాయంపై వారికి అర్హత కలిగిన తగ్గింపులను లెక్కించిన తర్వాత సంబంధిత బ్యాంక్ వారికి పెన్షన్/వడ్డీ చెల్లించే సమయంలో ఆ పన్ను మొత్తన్ని తీసివేసి చెల్లిస్తుంది అని ఈ పోస్టులో పేర్కొంది.

చివరగా, భారత ప్రభుత్వం సీనియర్ & సూపర్-సీనియర్ సిటిజన్లకు కొత్తగా ఎలాంటి పన్ను మినహాయింపును ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll