పాత పార్లమెంటు భవనంలో మహిళల కోసం టాయిలెట్లు లేని దుస్థితి ఉండేదంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కాంగ్రెస్ హయాంలో మహిళలకు అంటూ ప్రత్యేక టాయిలెట్ లేకపోవడంతో ఒక మహిళ జర్నలిస్టు యునిసెక్స్ ఉపయోగించినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ టాయిలెట్ డోర్ తట్టిన అనుభవాలను ఈ వీడియో ఆ మహిళ జర్నలిస్ట్ గుర్తు చేసుకుంది. అలాంటిది కాంగ్రెస్ ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని వ్యతిరేకిస్తుంది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ పోస్టులో చేస్తున్న వాదనలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ హయాంలో పాత పార్లమెంటు భవనంలో మహిళల కోసం టాయిలెట్లు లేని దుస్థితి ఉండేది.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ప్రస్తావించింది జర్నలిస్టులు కూర్చునే ఫస్ట్ ఫ్లోర్ గ్యాలెరీకు సంబంధించిన టాయిలెట్లకు సంబంధించి. కాగా పార్లమెంట్ ఇతర ఫ్లోర్లలో మహిళకు ప్రత్యేక టాయిలెట్స్ ఉండేవి. పైగా మొదటి ఫ్లోర్ గ్యాలెరీలో కూడా 2009 కాంగ్రెస్ హయాంలో మీరాకుమార్ స్పీకర్‌గా ఉన్న సమయంలోనే మహిళకు ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించారని ఈ ఇంటర్వ్యూలోనే మరో మహిళ జర్నలిస్ట్ తెలిపింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హయాంలో పాత పార్లమెంటు భవనంలో మహిళకు ప్రత్యేక టాయిలెట్స్ లేవన్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళా జర్నలిస్ట్ యు.పి.ఏ హయాంలో మహిళలకు ప్రత్యేకమైన టాయిలెట్లు లేకపోవడంతో యునిసెక్స్ టాయిలెట్ ఉపయోగించిన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంది. ఐతే కేవలం ఈ ఒక్క విషయం ఆధారంగా కాంగ్రెస్ హయాంలో పార్లమెంట్ భవనంలో మహిళల కోసం టాయిలెట్లు లేవని నిర్ధారణకు రాలేము.
ఎందుకంటే ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియోను పరిశీలిస్తే పోస్టులో చేస్తున్న వాదనకు విరుద్దమైన విషయాలు తెలుస్తాయి. అసలు మహిళలకు ప్రత్యేకమైన టాయిలెట్లు అని వీరు చర్చించుకుంటున్నది జర్నలిస్టులు కూర్చునే ఫస్ట్ ఫ్లోర్ గ్యాలెరీలో అని, మొత్తం పార్లమెంట్ భవనంలో కాదు. ఈ ఇంటర్వ్యూలో అంతకుముందు మాట్లాడిన మరో మహిళ జర్నలిస్ట్ మాట్లాడుతూ తాము కూర్చునే ఫస్ట్ ఫ్లోర్ గ్యాలెరీలో మహిళలు మరియు పురుషులకు కలిపి యునిసెక్స్ టాయిలెట్లు ఉండేవని, అప్పుడు తాము గ్రౌండ్ ఫ్లోర్‌లో మహిళా ఎంపీల కోసం నిర్మించిన టాయిలెట్స్ ఉపయోగించే వాళ్ళమని తెలిపింది.
అంతేకాకుండా మీరా కుమార్ స్పీకర్ అయ్యాక 2009లో ఫస్ట్ ఫ్లోర్ గ్యాలెరీలో మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ కట్టించిందని కూడా ఆమె తెలిపింది. వీటన్నిటిబట్టి వైరల్ అవుతున్న వీడియోలో ప్రస్తావించింది ఫస్ట్ ఫ్లోర్ గ్యాలెరీకి సంబంధించిన టాయిలెట్స్ గురించని, మిగతా పార్లమెంట్ భవనంలో మహిళలకు టాయిలెట్స్ ఉండేవని స్పష్టమవుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ గ్యాలెరీలో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించారని కూడా స్పష్టమవుతుంది.
చివరగా, పాత పార్లమెంట్ భవనంలో మహిళల ప్రత్యేక టాయిలెట్స్‌కు సంబంధించి ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను అసంపూర్ణంగా షేర్ చేస్తున్నారు.