Coronavirus Telugu, Fake News, Telugu
 

సైనికుడు తన కొడుకుని ప్లాస్టిక్ కవర్ కప్పి హత్తుకుంటున్న ఈ ఘటన మలేషియాలో జరిగింది, భారత దేశంలో కాదు

0

భారత సైనికుడు తన రెండేళ్ళ కూతురికి ప్లాస్టిక్ కవర్ ధరించి హత్తుకుంటున్న దృశ్యాలు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. తన నుండి కరోన వైరస్ సోకకుడదని ఆ సైనికుడు ఇలా కూతురికి ప్లాస్టిక్ కవర్ కప్పినట్టు తెలిపారు. ఆర్మీ దుస్తులు ధరించి ఉన్న ఒక సైనికుడు, ప్లాస్టిక్ కవర్ కప్పి ఉన్న తన బిడ్డని బాధతో హత్తుకుంటున్న ఫోటోలని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వైరస్ నుండి రక్షించడానికి తన రెండేళ్ళ కూతురికి ప్లాస్టిక్ కవర్ కప్పి హత్తుకున్న భారత సైనికుడి ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు ఏప్రిల్ 2020 సమయంలో మలేషియా దేశంలో తీసినవి. మలేషియాలో COVID-19 డ్యూటీ నిర్వహిస్తున్న ఒక సైనికుడు, తన కొడుకుకి తన నుంచి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఇలా ప్లాస్టిక్ కవర్ కప్పి హత్తుకున్నాడు. ఈ ఘటన భారతదేశంలో జరగలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ఏప్రిల్ 2020 లో పబ్లిష్ చేసిన మలేషియన్ న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మలేషియన్ ఆర్మీ లో వైద్య విభాగంలో పనిచేస్తున్న ఒక సైనికుడు, COVID-19 డ్యూటీ కారణంగా తన కొడుకుకి దూరమైనట్టు ఈ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. COVID-19 డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన అతను, కొడుకుకి తన నుంచి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఇలా అతనికి ప్లాస్టిక్ కవర్ కప్పి హత్తుకున్నట్టు మలేషియన్ న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి.

మలేషియాలో జరిగిన ఈ సంఘటనని తెలుపుతూ ఏప్రిల్ 2020లో పెట్టిన సోషల్ మీడియా పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటన మలేషియా దేశంలో జరిగిందని స్పష్టం చేస్తూ ‘Dainik Bhaskar’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు భారతదేశానికి సంబంధించినవి కావు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సైనికుడు తన కొడుకుని ప్లాస్టిక్ కవర్ కప్పి హత్తుకుంటున్న ఈ ఘటన మలేషియా దేశంలో జరిగింది, భారత దేశంలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll