Fake News, Telugu
 

ఈ వీడియోలో కారు అద్దాన్ని పదునైన సిరామిక్ ముక్కలతో పగులకొట్టారు, ఉప్పుతో కాదు

0

ఉప్పుని నోటిలో వేసుకొని ఉమ్మితో కలిపి కారు అద్దంపై విసిరితే అద్దం పగిలిపోతుందని చెప్తూ ఆ విధానాన్ని చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఉప్పుని ఉమ్మితో కలిపి కారు అద్దంపై విసరగానే అద్దం పగిలిపోవడాన్ని చూపే దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలోని వ్యక్తి పదునైన సిరామిక్ ముక్కలను ఉపయోగించి కారు అద్దాన్ని పగలగొట్టగలిగాడు. వీటినే ‘నింజా రాక్స్’ అని కూడా అంటారు. ఇవి ఇంజిన్‌లలో ‘స్పార్క్ ప్లగ్’ అనే భాగాన్ని పగులగొడితే లభించే పదునైన సిరామిక్ ముక్కలు. అనేక దేశాలలో దొంగలు కార్ల అద్దాలను పగలకొట్టడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, వాహనాల అద్దాలను సునాయాసంగా పగులగొట్టగలిగే ఈ పదునైన పదార్ధాలని “నింజా రాక్స్” అంటారని తెలిసింది. అయితే ఇవి ఉప్పు కణాలు  కావు. వివిధ ఇంజిన్‌లలో ఉండే ‘స్పార్క్ ప్లగ్’ అనే వస్తువులో సిరామిక్‌తో చేయబడిన భాగాన్ని పగులగొడితే అవి పదునైన ముక్కలుగా అవుతాయి. సంబంధిత దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

ఈ ముక్కలను కారు అద్దంపై బలంగా విసిరితే అద్దం పగిలిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. స్పార్క్ ప్లగ్‌లో వాడే ఈ సిరామిక్‌ భాగాన్ని ఇంజిన్లలో ఉండే వేడికి, ఒత్తిడికి తట్టుకునేలా అత్యంత దృఢంగా తయారు చేస్తారు. ఇక సాధారణంగా కార్ల అద్దాలకు “టెంపర్డ్ గ్లాస్” తో తయారు చేస్తారు. దీనిని అధిక ఉష్ణోగ్రతకు వేడి చేసి, ఆపై వేగంగా చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు. అందువలన టెంపర్డ్ గ్లాస్ యొక్క బయటి మరియు లోపలి భాగాల మధ్య ఒత్తిడిలో వ్యత్యాసం ఉంది. పదునైన ఈ సిరామిక్ ముక్కను విసరగానే పీడనం అంతా ఒకే చోట కేంద్రీకృతమవడంతో గ్లాస్ యొక్క బయటి పొర విరిగిపోతుంది. దాని వలన లోపల పొర చిన్న ముక్కలుగా పగిలిపోతుంది.

ఇక దొంగలు ఇలాంటి పద్ధతులను ఉపయోగించి కారు అద్దాలను ఎలా పగలకొడతారో చూపించడానికి కొన్ని నమూనా వీడియోలను పోలీసుల సమక్షంలో చిత్రీకరించారు. వీటిలో కూడా ‘నింజా రాక్స్’ ను ఉపయోగించడం చూడవచ్చు.

అయితే, వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి వాటిని ఉమ్మితో కలిపి విసరడానికి కారణం ముక్కలన్నీ ఒకే దగ్గర బలంగా అద్దానికి తగలడం కోసమేనని చెప్పవచ్చు.

చివరిగా, వైరల్ వీడియోలో కారు అద్దాన్ని పగలకొట్టింది పదునైన సిరామిక్ ముక్కలతో, ఉప్పుతో కాదు.  

Share.

About Author

Comments are closed.

scroll