నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా 25 వేల మంది జవాన్లు తమ శౌర్య చక్ర అవార్డులు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్తూ, ఒక వార్తాపత్రిక క్లిప్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రైతుల ఉద్యమానికి మద్దతుగా 25 వేల మంది జవాన్లు తమ శౌర్య చక్ర అవార్డులు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫాక్ట్: అది ఒక ఫేక్ న్యూస్. అసలు ఇప్పటివరకు అంత మందికి శౌర్య చక్ర అవార్డులను ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటివరకు సుమారు 2,255 మంది శౌర్య చక్ర అవార్డు పొందారు. అంతేకాదు, వారిలో కొంత మంది చనిపోయాక అవార్డు పొందారు. ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ‘ప్రజాశక్తి’ వారు ప్రచురించిన వార్త తప్పు అని ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వార్తాపత్రిక క్లిప్ గురించి వెతకగా, ఆ వార్తను ‘ప్రజాశక్తి’ వారు ప్రచురించినట్టు తెలిసింది. ‘రైతు ఉద్యమానికి మద్దతుగా 25 వేల మంది మాజీ సైనికులు తమ శౌర్య పతకాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరిలో 5 వేల మంది ఇప్పటికే వాపసు చేశారు’, అని ‘ప్రజాశక్తి’ ఆర్టికల్ లో రాసి ఉన్నట్టు ఇక్కడ (ఆర్కైవ్డ్) మరియు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవొచ్చు.
అయితే, అసలు ఇప్పటివరకు అంత మందికి శౌర్య చక్ర అవార్డులను ప్రభుత్వం ఇవ్వలేదని తెలిసింది. రక్షణ మంత్రిత్వ శాఖ వారి ‘గాలంటరీ అవార్డులు’ వెబ్సైటులో ఇప్పటివరకు సుమారు 2,255 మంది శౌర్య చక్ర అవార్డు పొందారని ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, వారిలో కొంత మంది చనిపోయాక అవార్డు పొందారు. కావున, ‘ప్రజాశక్తి’ వారు ప్రచురించిన వార్తలో నిజం లేదు. కానీ, కొంత మంది మాజీ జవాన్లు తమకు వచ్చిన అవార్డులు తిరిగి ఇవ్వడానికి అయినా సిద్ధం అని చెప్పినట్టు ఇక్కడ చూడవొచ్చు. తిరిగి ఇవ్వడానికి సుమారు 5 వేల గాలంటరీ మెడల్స్ ఇప్పటికి వరకు సేకరించామని, రెండు రోజుల్లో సుమారు 25 వేల మెడల్స్ సేకరించనున్నట్టు మాజీ జవాన్లు తెలిపినట్టు ‘ది హిందూ’ వారు 12 డిసెంబర్ 2020 న ప్రచురించారు; అయితే వారు 25 వేల శౌర్య చక్ర అవార్డులు అని ఎక్కడా రాయలేదు.
‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ‘ప్రజాశక్తి’ వారు ప్రచురించిన వార్త తప్పు అని ట్వీట్ చేసారు. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇది తప్పని చెప్తూ, అసలు 1956 నుండి 2019 వరకు 2,048 శౌర్య చక్ర అవార్డులు మాత్రమే ఇచ్చామని తమ ప్రెస్ రిలీజ్ లో పేర్కొన్నారు.
చివరగా, ‘రైతులకు మద్దతుగా 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులు వెనక్కి’ అనేది ఫేక్ వార్త. అసలు ఇప్పటివరకు అంత మందికి శౌర్య చక్ర అవార్డులను ప్రభుత్వం ఇవ్వలేదు.