Fake News, Telugu
 

‘సచ్చి రామాయణం’ పుస్తకంపై నిషేదాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ 1976లో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులో రామాయణం కల్పిత గ్రంథం అని అనలేదు

0

రామాయణం ఒక కల్పిత గ్రంథం అని సుప్రీంకోర్టు 1976లో  ఒక లిటిగేషన్‌కు సంబంధించి తీర్పు చెప్పింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. 16 సెప్టెంబర్ 1976న  లిటిగేషన్‌ నం. 291/1971కు సంబంధించి కోర్టు ఈ తీర్పు చెప్పిందని ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి వివరణ కోరుతూ మా టిప్‌లైన్‌కు ఒక అభ్యర్ధన కూడా వచ్చింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రామాయణం ఒక కల్పిత గ్రంథం అని సుప్రీంకోర్టు 1976లో  ఒక లిటిగేషన్‌కు సంబంధించి ఇచ్చిన తీర్పులో చెప్పింది.

ఫాక్ట్(నిజం): ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెరియార్ రాసిన పుస్తకానికి అనువాదం అయిన వివాదాస్పద ‘సచ్చి రామాయణం’ అనే పుస్తకంపై  విధించిన నిషేధాన్ని ఎత్తేస్తూ 16 సెప్టెంబర్ 1976న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఐతే ఈ తీర్పులో రామాయణం ఒక కల్పిత గ్రంథం అని సుప్రీంకోర్టు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టానికి లోబడే ఈ పుస్తకంపై నిషేధం విధించిందా లేదా అన్న లీగల్ అంశాన్ని పరిశీలించి మాత్రమే అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో అందించిన వివరాల ప్రకారం ఇది పెరియార్ రాసిన దీ రామాయణ: ఏ ట్రూ రీడింగ్ పుస్తకానికి హిందీ అనువాదం అయిన ‘సచ్చి రామాయణం’ అనే పుస్తకాన్ని 1969లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన కేసుకు సంబంధించింది.

సచ్చి రామాయణం :

పెరియార్ ఈవీ రామసామి నాయకర్ రాసిన ‘దీ రామాయణ: ఏ ట్రూ రీడింగ్’ పుస్తకాన్ని లలై సింగ్ యాదవ్ అనే వ్యక్తి 1968లో హిందీలోకి ‘సచ్చి రామాయణం’ పేరుతో అనువదించి పబ్లిష్ చేసాడు. ఐతే ఈ పుస్తకంపై ఉత్తర భారత్ దేశంలో వివాదం నెలకొంది. ఈ పుస్తకాన్ని వ్యతిరేకిస్తూ అనేక నిరసనలు జరగడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1969లో ఈ పుస్తకాన్ని నిషేధించింది. CrPc సెక్షన్ 99A కింద మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా ఉందన్న ఆరోపణలపై ప్రభుత్వం ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది.

ప్రభుత్వం ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయడంతో లలై సింగ్ అలహాబాద్ హైకోర్టును సంప్రదించాడు. విచారణ అనంతరం 1971లో కోర్టు ఈ పుస్తకంపై విధించిన బ్యాన్‌ను ఎత్తేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ వీ.ఆర్.కృష్ణయ్యర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై (ఉత్తరప్రదేశ్ వర్సెస్ లలై సింగ్ యాదవ్) విచారణ చేపట్టింది. ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో ప్రస్తావించింది ఈ కేసు గురించే (లిటిగేషన్ నెం. 291/1971: ఉత్తరప్రదేశ్ వర్సెస్ లలై సింగ్ యాదవ్). విచారణ అనంతరం 16 సెప్టెంబర్ 1976న అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తూ పుస్తక ప్రచురణకర్తకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.

రామాయణం కల్పిత గ్రంథం అని ఈ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయపడలేదు:

ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు ఈ తీర్పులో రామాయణం ఒక కల్పిత గ్రంథం అని సుప్రీంకోర్టు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టానికి లోబడే ఈ పుస్తకంపై నిషేధం విధించిందా లేదా అన్న లీగల్ అంశాన్ని పరిశీలించి మాత్రమే అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో శ్రీరాముడు, సీత వంటి వ్యక్తుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రస్తావించిందే తప్ప పుస్తకంలోని కంటెంట్‌పై స్పష్టంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతలను రక్షించడం కోసం పుస్తకాన్ని బ్యాన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తిస్తూనే, ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛ మరియు సామాజిక శాంతిని కాపాడటంలో రాజ్యాంగ సమతుల్యత పాటించాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

చివరగా, సచ్చి రామాయణం పుస్తకంపై నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్దిస్తూ 1976లో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులో రామాయణం కల్పిత గ్రంథం అని అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll