“సౌదీ అరేబియా, పాకిస్తాన్ లేదా 56 ఇస్లామిక్ దేశాలలో ఏదైనా ఎన్నికలలో హిందువులకు ఓటు వేసే హక్కు లేదు” అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సౌదీ అరేబియా, పాకిస్తాన్ లేదా 56 ఇస్లామిక్ దేశాలలో జరిగే ఏదైనా ఎన్నికలలో హిందువులకు ఓటు వేసే హక్కు లేదు.
ఫాక్ట్(నిజం): పాకిస్థాన్, బంగ్లాదేశ్, సూడాన్, ఒమన్ వంటి పలు ఇస్లామిక్ దేశాలలో ముస్లింలు కానీ వారికి (మైనారిటీలకు) కూడా ఓటు హక్కు ఉంది. అలాగే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల పార్లమెంట్ లో హిందువులు ఎంపీలుగా కూడా ఉన్నారు. చాలా వరకు ఇస్లామిక్ దేశాలలో పాలన రాజులు ద్వారానే ఇంకా సాగుతుంది. ఉదాహరణకు సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ మొదలనవి అక్కడ కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)లో భాగమైన 56 (సిరియా మినహా) ఇస్లామిక్ దేశాలలో జరిగే ఏదైనా ఎన్నికలలో హిందువులకు లేదా ముస్లిం మతానికి చెందని వారికి ఓటు వేసే హక్కు లేదా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, పలు ఇస్లామిక్ దేశాలలో ముస్లింలు కాని వారికి కూడా ఓటు హక్కు ఉందని తెలిసింది.
ఇదే విషయమై పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను పరిశీలించగా, 18 ఏళ్లు పైబడిన ప్రతి పాకిస్తానీ పౌరుడికి (మానసికంగా స్థిరంగా ఉన్న పౌరులు) మతంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు ఉందని తెలిసింది. అంతేకాకుండా, పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్)లో పలువురు హిందూ ఎంపీలు కూడా ఉన్నారని తెలిసింది. పాకిస్థాన్ ఎన్నికలో హిందువులు కూడా ఓటు హక్కు ఉందని తెలిపే పలు వార్త కథనాలు ఇక్కడ చూడవచ్చు.
బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను పరిశీలించగా, బంగ్లాదేశ్ లో 18 ఏళ్లు పైబడిన ప్రతి బంగ్లాదేశ్ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు ఉందని తెలిసింది. అయితే వీరిపై ఎలాంటి దేశద్రోహం కేసులు ఉండదు.
సూడాన్ లో 18 ఏళ్లు పైబడిన ప్రతి సూడాన్ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉందని తెలిసింది. అయితే వీరు మానసికంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.
ఇకపోతే సౌదీ అరేబియాలో పాలన అక్కడి రాజుల చేతిలో ఉంటుంది. కేవలం అక్కడ మున్సిపల్ మరియు కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. అలాగే’ 2015 వరకు సౌదీలో మహిళలకు ఓటు హక్కు లేదు. ప్రస్తుతం, సౌదీ అరేబియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి సౌదీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా అక్కడ ఓటు హక్కు ఉందని తెలిసింది. అయితే వీరు అక్కడి మిలటిరీలో పనిచేసేవారు అయితే ఓటు హక్కు ఉండదు.
అలాగే మరో ఇస్లామిక్ దేశమైన ఒమన్ లో కూడా పాలన అక్కడి రాజుల చేతిలో ఉంటుంది కేవలం అక్కడ మున్సిపల్ మరియు కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. ఒమన్ లో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒమన్ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా అక్కడ ఓటు హక్కు ఉందని తెలిసింది.
చివరగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పలు ఇస్లామిక్ దేశాలలో ముస్లింలు కాని వారికి కూడా ఓటు హక్కు ఉంది.