Fake News, Telugu
 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పోస్టల్ బాలట్ ప్రభావం చూపలేదు

0

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగుల ఐక్యత వల్ల కాంగ్రెస్ 24 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలిచింది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు ఐక్యతతో వేసిన పోస్టల్ ఓట్ల వల్ల 24 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఫాక్ట్ (నిజం): తెలంగాణాలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల డేటా ప్రకారం చేవెళ్ల నియోజకవర్గంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరుపున విజయం సాధించిన కాలె యాదయ్యకు వచ్చిన ఆధిక్యత (268) మాత్రమే తనకు వచ్చిన పోస్టల్ ఓట్ల (969) కంటే తక్కువ ఉంది. కాంగ్రెస్ విజయం సాధించిన ఏ నియోజకవర్గంలో కూడా పోస్టల్ ఓట్లు మెజారిటీని మించలేదు, ప్రభావం చూపెట్టలేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఎన్నికలలో పోటీ చేసిన ఒక అభ్యర్థి విజయాన్ని పోస్టల్ ఓట్లు నిర్దేశిస్తున్నాయి అంటే, దాని అర్థం ఆ అభ్యర్ధికి వచ్చిన మెజారిటీ తనకు వచ్చిన పోస్టల్ ఓట్ల కంటే తక్కువ ఉందని అర్థం. ఇది తెలుసుకోవడానికి తెలంగాణాలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల డేటాను సేకరించి పరిశీలించడం జరిగింది.

ఈ డేటా ద్వారా, తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికలలో అత్యధికంగా పోల్ అయిన పోస్టల్ ఓట్లు 4501 అని గమనించాం. దీన్ని బట్టి పోస్టల్ ఓట్లు ఒక అభ్యర్థి విజయాన్ని నిర్దేశిస్తున్నాయి అంటే, ఆ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 4501 కంటే తక్కువ ఉండాలని స్పష్టం అవుతుంది. ఎందుకంటే, మెజారిటీ 4501 కంటే ఎక్కువ ఉన్నపుడు ఆ అభ్యర్థికి ఒక్క పోస్టల్ ఓటు రాకున్నా కూడా మెజారిటీలోనే ఉండేవాడు. 4501 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థుల లిస్ట్ ఈ క్రింది టేబుల్లో చూడవొచ్చు.

4501 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థులను గమనిస్తే, మొత్తం ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది. కానీ వీళ్లకు వచ్చిన పోస్టల్ ఓట్లను మరియు మెజారిటీని గమనిస్తే, కేవలం చేవెళ్ల నియోజకవర్గంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరుపున విజయం సాధించిన కాలె యాదయ్యకు వచ్చిన మెజారిటీ (268) మాత్రమే తనకు వచ్చిన పోస్టల్ ఓట్ల (969) కంటే తక్కువ ఉంది. మిగితా అభ్యర్థులందరికీ వచ్చిన మెజారిటీ వాళ్లకు వచ్చిన పోస్టల్ ఓట్ల కంటే ఎక్కువ ఉంది. అంటే కాంగ్రెస్ తరుపున విజయం సాధించిన ఏ ఒక్క అభ్యర్థి విజయాన్ని కూడా పోస్టల్ ఓట్లు నిర్ణయించలేదు.

చివరిగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పోస్టల్ బాలట్ ప్రభావం చూపలేదు.

Share.

About Author

Comments are closed.

scroll