Fake News, Telugu
 

ఇమాటినిబ్ మెసైలేట్ అనే టాబ్లెట్ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లను నయం చెయ్యదు

0

‘ ‘బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!!’…  ‘ఎమోటిఫ్ మెర్సిలేట్’ బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం… .పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది.’ అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ‘ఎమోటిఫ్ మెర్సిలేట్’ బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం.

ఫ్యాక్ట్ (నిజం): ఈ టాబ్లెట్ లేదా డ్రగ్  యొక్క అసలు పేరు ‘ఇమాటినిబ్ మెసైలేట్’, దీన్ని కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మందుని క్రానిక్ మైలో జీనస్ లుకేమియా అనే బ్లడ్ కాన్సర్ ఉన్న రోగులలో ఫలితాలను చాలా మెరుగుపరిచింది. క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి పేషెంటుకు మందులు ఇవ్వటం జరుగుతుంది, అంతేగాని ఒకే మందుతో అన్ని రకాల క్యాన్సర్లని నయం చేయలేరు. బ్లడ్ క్యాన్సర్లో అనేక రకాలు ఉంటాయి, ఇమాటినిబ్ మెసైలేట్ వీటిలో కొన్నిటి యొక్క చికిత్సలోనే ఉపయోగిస్తారు. కావున, పోస్టులో చేస్తున్న క్లయిము తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో ఉన్న ఔషధం ‘ఎమోటిఫ్ మెర్సిలేట్’ గురించి ఇంటర్నెట్లో వెతుకగా, ఇలాంటి సమాచారం ఉన్న పోస్టులు కొన్ని లభించాయి. వాటిని బట్టి ఇమిటినెఫ్ మెర్సిలెట్ అనే ఒక ఔషధం బ్లడ్ క్యాన్సర్ని నయం చేస్తుందని, చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఉచితంగా ఇస్తారని ఉంది.

అయితే, ఇది తప్పుదోవ పట్టించే మెసేజ్ అని చెప్తూ అడయార్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఒక నోటీసు జారీ చేసారు. దాంట్లో “చెన్నైలోని అడయార్‌లోని క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ఇమిటినెఫ్ మెర్సిలెట్’…  అనే ఔషధం అన్ని రక్త క్యాన్సర్లను నయం చేస్తుంది మరియు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా అందించబడుతుందని సందేశం తరచుగా షేర్ చేస్తున్నారు. ఇది తప్పుదోవ పట్టించే సందేశమని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. ‘క్రానిక్ మైలో జీనస్ లుకేమియా’ అని పిలువబడే ఒక రకమైన రక్త క్యాన్సర్‌ను చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం అయిన ‘ఇమాటినిబ్ మెసైలేట్’ అనే ఔషధం యొక్క వక్రీకరణ ఈ పేర్కొన్న ఔషధం పేరు అని మేము నమ్ముతున్నాము. ఈ ఔషధం భారతదేశం అంతటా అందుబాటులో ఉంది….’ అని అభ్యర్థించారు.

ఇమాటినిబ్ మెసైలేట్ క్రానిక్ మైలో జీనస్ లుకేమియా’ యొక్క చికిత్సలో ముఖ్యంగా ఉపయోగించే టాబ్లెట్/డ్రగ్. పేషెంట్ కి ఈ వ్యాధి నిర్ధారణ అవగానే అది అడ్వాన్స్ స్టేజీకి వెళ్లడాన్ని అరికట్టడానికి ఈ మందుని ఉపయోగిస్తారు. ఇమాటినిబ్ అసాధారణ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.

పోస్టులో చెప్తున్న ‘ఇమిటినెఫ్ మెర్సిలెట్’ టాబ్లెట్ గురించి టైమ్స్ అఫ్ ఇండియా వారితో హెమటాలజిస్ట్ సమీర్ మెలింకేరి మాట్లాడుతూ ఇది ఒక స్పాం మెసేజ్ అని చెప్పారు. 2015లో డాక్టర్ విశాల్ రావు, (కన్సల్టెంట్, తల మరియు మెడ శస్త్రచికిత్స,  HCG క్యాన్సర్ కేర్ ఇన్ కర్ణాటక) ‘ఇమిటినెఫ్ మెర్సిలెట్’ గురించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో  ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని రకాల క్యాన్సర్లను నయం చేసే మందు లేదు అని చెప్పారు.

ప్రాక్టో వెబ్సైటులో ఒక యూసర్ ఈ టాబ్లెట్ బ్లడ్ క్యాన్సర్ను నయం చేస్తుందా  అని అడుగగా, ప్రాక్టో ద్వారా వెరిఫై చెయ్యబడ్డ డాక్టర్ కౌశల్ యాదవ్ ‘ఏదైనా ఔషధం క్యాన్సర్ యొక్క నిర్దిష్ట లక్షణాల ఆధారంగా ఇవ్వబడుతుంది. అన్ని క్యాన్సర్లకు గుడ్డిగా ఒకే మందు లేదు’ అని అన్నారు.

వీటన్నిటి ఆధారంగా ఇమాటినిబ్ మెసైలేట్, అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లను నయం చేసే ఒక మందు కాదు అని నిర్ధారించుకోవచ్చు. పోస్టులో ఈ మందు పుణెలోని యశోద హెమటాలజీ క్లినిక్ లో లభిస్తుందని ఉంది. ఈ విషయాన్ని కనుక్కోవడానికి పోస్టులో ఉన్న నంబర్లకు ఫోన్ చేయగా అవి పనిచేయటం లేదు. క్యాన్సర్లలోని రకాలగురించి తెలుసుకోవటానికి ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇమాటినిబ్ మెసైలేట్ గురించి మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ పొందొచ్చు.

చివరిగా, ఇమాటినిబ్ మెసైలేట్ అనే టాబ్లెట్ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లను నయం చెయ్యదు,  ‘క్రానిక్ మైలో జీనస్ లుకేమియా’ అని పిలువబడే ఒక రకమైన బ్లడ్  క్యాన్సర్‌ చికిత్సలో దీనిని ఎక్కువగా వాడుతారు.

Share.

About Author

Comments are closed.

scroll