పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది, భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది.
ఈ నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై ఉండే బగ్లిహార్, సలాల్ డ్యామ్ గేట్లను భారత్ మూసివేయడంతో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోయిందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోవడాన్ని చూపుతున్న దృశ్యాలు.
ఫాక్ట్: వైరల్ వీడియో భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని అఖనూర్ ప్రాంతంలో ఎండిపోయిన చినాబ్ నది యొక్క దృశ్యాలను చూపుతుంది. అయితే, చీనాబ్ నదిపై ఉండే బగ్లిహార్, సలాల్ డ్యామ్ గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ ప్రాంతంలో చీనాబ్ నది ప్రవాహం గణనీయంగా తగ్గిందని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) న్యూస్ ఏజెన్సీ 05 మే 2025న Xలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. బగ్లిహార్, సలాల్ డ్యామ్ గేట్లు మూసివేడంతో జమ్మూ కాశ్మీర్లోని అఖనూర్ ప్రాంతంలో చీనాబ్ నది నీటి మట్టం గణనీయంగా తగ్గిందని పోస్టులో వివరణలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
అఖనూర్ పట్టణం భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది. చీనాబ్ నది అఖనూర్ గుండా ప్రవహించి సియాల్‌కోట్ వద్ద పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. వైరల్ వీడియోలో చూపించిన వంతెనను అఖనూర్ పట్టణంలో చీనాబ్ నదిపై నిర్మించిన అఖనూర్ స్టీల్ బ్రిడ్జిగా గుర్తించాం. దీన్ని చూపించే గూగుల్ స్ట్రీట్ వ్యూని ఇక్కడ చూడవచ్చు.

ఇక వార్తా కథనాల ప్రకారం, పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చీనాబ్ నది ఎగువన ఉన్న బగ్లిహార్, సలాల్ డ్యామ్ గేట్లను మూసేశారు. అయితే, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లోనిs సియాల్‌కోట్ ప్రాంతంలోని ఉన్న మారాలా ప్రాజెక్టుకి చీనాబ్ నది ప్రవాహం గణనీయంగా తగ్గిందని, దీని వల్ల తీవ్ర నీటి కొరత ఏర్పడిందని పాకిస్తానీ అధికారులు చెప్పినట్లు పాకిస్తాన్ మీడియా సంస్థ ది డాన్ వెల్లడించింది.

చివరిగా, పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోయిందని జమ్మూ కాశ్మీర్లోని అఖనూర్ దృశ్యాలను షేర్ చేస్తున్నారు.