Fake News, Telugu
 

NCRB 2022 వార్షిక రిపోర్ట్ ప్రకారం ఇతర నగరాలతో పోలిస్తే 2022లో హైదరాబాద్‌లో అత్యధికంగా 246 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి

0

ఇటీవలి కాలంలో, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని హోటళ్లు, మసాలా & అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలు మరియు ఇతర తినుబండారాల విక్రయ కేంద్రాలపై  ఫుడ్‌‌సేఫ్టీ అధికారుల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ తనిఖీల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కాలం చెల్లిన, పాడైన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే, “దేశంలోని 19 ప్రముఖ నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్ల వంటశాలల పరిశుభ్రతపై  నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (NCRB) ఇటీవల చేసిన సర్వేలో హైదరాబాద్ నగరం ఫుడ్ క్వాలిటీలో చివరి  స్థానంలో నిలిచింది” అని చెప్తున్న పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). “NCRB సర్వేలో, హైదరాబాద్ నగరంలోని 62 శాతం హోటళ్లు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది మరియు గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం నిలిచిందని” ఈ పోస్టులు పేర్కొన్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల నవంబర్ 2024లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) దేశంలోని 19 ప్రముఖ నగరాల్లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరం ఆహార నాణ్యతలో చివరి స్థానంలో నిలిచింది.

ఫాక్ట్(నిజం): ఈ డేటా ఇటీవలది కాదు. వైరల్ పోస్టులో, 2022 సంవత్సరంలో నమోదైన నేరాలకు సంబంధించి డిసెంబర్ 2023లో విడుదల చేసిన NCRB వార్షిక రిపోర్టులోని డేటాను పేర్కొన్నారు. ఈ 2022 NCRB రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా 246 కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. అంటే 2022లో మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. అలాగే ఇది NCRB చేసిన సర్వే డేటా కాదు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేరాల (క్రైమ్స్)కు సంబంధించిన డేటా ఆధారంగా NCRB ప్రతి సంవత్సరం వార్షిక రిపోర్టును విడుదల చేస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

NCRB సర్వేలో హైదరాబాద్ నగరం ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానంలో నిలిచింది అంటూ పలు తెలుగు మీడియా సంస్థలు కూడా ఇటీవల కథనాలను ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అయితే ఈ డేటా 2022 సంవత్సరానికి సంబంధించినది, ప్రస్తుత తనిఖీల నేపథ్యంలో మీడియా సంస్థలు ఈ NCRB 2022 రిపోర్టులో పేర్కొన్న ఆహార కల్తీకి సంబంధించి నమోదైన కేసుల డేటాను ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాయి.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల నవంబర్ 2024లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) దేశంలోని 19 ప్రముఖ నగరాల్లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరం ఆహార నాణ్యతలో చివరి స్థానంలో నిలిచిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ మొదటి స్థానంలో ఉందని NCRB రిపోర్టు పేర్కొంది అంటూ డిసెంబర్ 2023లో ప్రచురించబడిన పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే రికార్డయ్యాయి. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి.

తదుపరి మేము ఇదే విషయమై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) చివరిగా డిసెంబర్ 2023లో వెలువరించిన 2022 క్రైమ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ పరిశీలించాము, ఈ రిపోర్టులో 2022 సంవత్సరంలో దేశంలో నమోదైన వివిధ నేరాలకు (క్రైమ్స్) సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్ ప్రకారం, 2022 ఏడాదిలో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద ఈ కేసులు నమోదు చేశారు. ఈ రిపోర్టు ప్రకారం, మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. రెండో స్థానంలో ఉన్న ముంబై నగరంలో 36 ఆహార కల్తీ కేసులు రికార్డయ్యాయి.

రాష్ట్రాల వారీగా చూసుకుంటే, దేశవ్యాప్తంగా 2022లో 4,694 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఆహార కల్తీలో ముందు ఉన్నాయి. 2828 ఆహార కల్తీ కేసులతో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణ వ్యాప్తంగా 1,631 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. ఇది 2022లో దేశం మొత్తంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 35 శాతానికి సమానం. 

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది సర్వే కాదు, ఆ సంవత్సరంలో నమోదైన వివిధ నేరాలకు సంబంధించిన నివేదిక (రిపోర్ట్) మాత్రమే. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేరాల (నేరాలు) డేటా ఆధారంగా ఈ నివేదికను NCRB ప్రచురిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా, ఈ 2022 ఏడాదికి గాను దేశంలో నమోదైన నేరాలకు సంబంధించిన NCRB పబ్లిష్ చేసిన నివేదికను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఫుడ్‌‌సేఫ్టీ అధికారుల తనిఖీల నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, 2022లో భారతదేశంలో నమోదైన నేరాలపై NCRB ప్రచురించిన వార్షిక రిపోర్ట్ ప్రకారం ఇతర నగరాలతో పోలిస్తే 2022లో హైదరాబాద్‌లో అత్యధికంగా 246 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి

Share.

About Author

Comments are closed.

scroll