ఇటీవల కర్నాటకలోని షిమోగాలో బజరంగ్ దళ్ కార్యకర్త అయిన హర్ష హత్య జరిగిన నేపథ్యంలో ‘కర్ణాటక శివమోగాలో తన సోదరుడు హర్షను భజరంగ్ దల్ కార్యకర్తలు చంపి ముస్లింల మీద నిందలు వేస్తున్నారు’ అని హర్ష సొదరి అన్నట్టు, తాను మీడియాతో మాట్లాడుతున్న ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘కర్ణాటక శివమోగాలో తన సోదరుడు హర్షను భజరంగ్ దల్ కార్యకర్తలు చంపి ముస్లింల మీద నిందలు వేస్తున్నారు’ – హర్ష సొదరి.
ఫాక్ట్(నిజం): హర్షని కచ్చితంగా వీల్లే (భజరంగ్ దల్ లేదా ముస్లింలు) హత్య చేసారంటూ హర్ష సొదరి ఎవరిపైన ఆరోపణ చేయలేదు. ‘హిందూ, హిందుత్వం అన్నందుకే నా తమ్ముడు ఈ స్థితిలో ఉన్నాడు, ఒకసారి చుడండి. నేను నా చేతులు జోడించి కోరుతున్నాను, ముస్లిం అయినా హిందువు అయినా మీ తల్లిదండ్రులకు మంచి పిల్లలుగా ఉండండి, ఇలాంటి వాటిలోకి దిగకండి’ అని మాత్రమే ఆమె వైరల్ క్లిప్‌లో అన్నది. ఒకవేళ తన తమ్ముడి హత్యకి భజరంగ్ దళ్ కారణం అని ఆరోపించి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఇలాంటి కథనాలేవి మాకు లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కర్నాటకలోని షిమోగాలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు సంబంధించి హర్ష సొదరి అశ్విని మీడియాతో మాట్లాడింది. పోస్టులో షేర్ చేసింది ఆమె మాట్లాడిన ఒక న్యూస్ క్లిప్.
ఐతే పోస్టులో షేర్ చేసిన వీడియోలో హర్షను భజరంగ్ దల్ కార్యకర్తలు చంపి ముస్లింల మీద నిందలు వేస్తున్నారని ఆమె ఎక్కడా కూడ అనలేదు. ‘హిందూ, హిందుత్వం అన్నందుకే నా తమ్ముడు ఈ స్థితిలో ఉన్నాడు, ఒకసారి చుడండి. నేను నా చేతులు జోడించి కోరుతున్నాను, ముస్లిం అయినా హిందువు అయినా మీ తల్లిదండ్రులకు మంచి పిల్లలుగా ఉండండి, ఇలాంటి వాటిలోకి దిగకండి’ అని మాత్రమే ఆమె ఈ17 సెకండ్ల వీడియోలో అన్నది.
ఐతే కన్నడ వన్ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన 27 సెకండ్ల వీడియో క్లిప్‌లో ఆమె ఈ విధంగా అంది ‘ హర్ష ఒక్కడే కొడుకు. హిందువుగా ఉండడం తప్ప తను మరేమీ చేయలేదు. హిందూ, హిందుత్వం అన్నందుకే నా తమ్ముడు ఈ స్థితిలో ఉన్నాడు, ఒకసారి చుడండి. నేను నా చేతులు జోడించి కోరుతున్నాను, ముస్లిం అయినా హిందువు అయినా మీ తల్లిదండ్రులకు మంచి పిల్లలుగా ఉండండి, ఇలాంటి వాటిలోకి దిగకండి’.
ఈ విషయానికి సంబంధించి ఆమె పలు మీడియా సంస్థలతో మాట్లాడింది. తన తమ్ముడిని ఎవరు చంపారో నాకు తెలియదు, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ హర్ష సోదరి పబ్లిక్ టీవీతో మాట్లాడిన వీడియో ఇక్కడ చూడొచ్చు. ఐతే హర్షని కచ్చితంగా వీల్లే (భజరంగ్ దల్ లేదా ముస్లింలు) హత్య చేసారంటూ ఆమె ఎవరిపైన ఆరోపణ చేయలేదు. ఇతర మీడియా సంస్థలతో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఇలాంటి అభ్యర్దనలే చేసిందే తప్ప ఎవరిపైన ఆరోపణలు చేయలేదు.
కేవలం తన తమ్ముడి హత్యకు సంబంధించి న్యాయం చేయాలనీ, ఇలాంటి వాటిలోకి ఎవరు దిగకూడదని మాత్రమే ఆమె అభ్యర్ధించింది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు.
ఒకవేళ తన తమ్ముడి హత్యకి భజరంగ్ దళ్ కారణం అని ఆరోపించి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఇలాంటి కథనాలేవి మాకు లభించలేదు. ఇదిలా ఉండగా హర్ష హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.
చివరగా, భజరంగ్ దళ్ కార్యకర్తలు తన తమ్ముడి హత్య చేసి ముస్లింల మీద నిందలేస్తున్నారని హర్ష సోదరి అశ్విని అనలేదు.