తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారని ఆయన చెప్పడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
ఫాక్ట్: ఈ వీడియో ఫిబ్రవరి 2024 నాటిది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పూర్తి వీడియోలో బుచ్చయ్య చౌదరి వై.ఎస్.జగన్ పాలన గురించి విమర్శలు చేయడం చూడవచ్చు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని ‘TV9 Telugu Live’ యూట్యూబ్ ఛానెల్లో 05 ఫిబ్రవరి 2024న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకి వచ్చింది.

ఇక, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని (ఇక్కడ & ఇక్కడ) పరిశీలించగా, 05 ఫిబ్రవరి 2024న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం తప్పుల తడకగా ఉందని, అందుకే సభను బహిష్కరించామని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ పాలన గురించి కూడా ఆయన విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

పై ఆధారాలను బట్టి, బుచ్చయ్య చౌదరి విమర్శించింది 2024లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని అని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కాదని స్పష్టమవుతుంది.
చివరిగా, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు.