‘మహాద్భుతం! లక్నో గుండా ప్రవహించే #గోమతీ రివర్‌ఫ్రంట్ రూపురేఖలను కళ్ళు చెదిరేలా పూర్తిగా మార్చేసిన యోగీ ఆదిత్యనాథ్’, అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లక్నో లో నిర్మించిన గోమతీ రివర్‌ఫ్రంట్ యొక్క ఫోటో.
ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటో గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించిందే. కానీ ఆ ప్రాజెక్ట్ ని కేవలం యోగీ ప్రభుత్వం నిర్మించలేదు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ సమయంలో సుమారు 60 శాతం పనులు జరిగాయని ఏప్రిల్ 2017 లో ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారితో యోగీ ప్రభుత్వం లోని అప్పటి నీటిపారుదల మంత్రి తెలిపారు. కావున పోస్ట్ లో గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించి కేవలం యోగీ ప్రభుత్వం ని పొగుడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లోని ఫోటో గురించి వెతకగా, అది ఎప్పుడు ఎవరు తీసారనే కచ్చితమైన సమాచారం లభించలేదు. లక్నో లోని గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించిన ఇతర ఫోటోలను, వీడియోలను, మరియు గూగుల్ ఎర్త్ లో ఆ ప్రదేశాన్ని చూడగా, పోస్ట్ లోని ఫోటో గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించిందే అని తెలిసింది.

అయితే, ఆ రివర్‌ఫ్రంట్ కి సంబంధించిన వివరాలు చూడగా, ఆ ప్రాజెక్ట్ పనులు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం సమయంలోనే మొదలైనట్టు తెలిసింది. అంతేకాదు, మార్చి 2017 లో యోగీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి సుమారు 60 శాతం వరకు ఆ రివర్‌ఫ్రంట్ పనులు జరిగినట్టు ఏప్రిల్ 2017 లో ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారితో యోగీ ప్రభుత్వం లోని అప్పటి నీటిపారుదల మంత్రి తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు.

మార్చి 2017 నాటికి (అంటే యోగీ ప్రభుత్వం వచ్చే సమయానికి) సుమారు 1427 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్న వీడియోని ఇక్కడ చూడవొచ్చు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం సమయంలో ఆ ప్రాజెక్ట్ పనులు పూర్తి అవలేదని మరియు ఇతర అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిసింది.

యోగీ ప్రభుత్వం రాకముందు తీసిన గోమతీ రివర్‌ఫ్రంట్ నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. మార్చి 2017 కి ముందు గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించి తీసిన మరిన్ని ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అదే ప్రదేశంలో 2017 ఎన్నికల ముందు అఖిలేష్ యాదవ్ తో ‘ఇండియా టుడే’ చేసిన ఇంటర్వ్యూ ని ఇక్కడ చూడవొచ్చు.


గూగుల్ ఎర్త్ లో ఆ ప్రదేశానికి సంబంధించిన డిసెంబర్ 2016 దృశ్యాల్లో కూడా యోగీ ప్రభుత్వం రాకముందే గోమతీ రివర్‌ఫ్రంట్ పనులు ప్రారంభం అయినట్టు చూడవొచ్చు.

చివరగా, గోమతీ రివర్‌ఫ్రంట్ ని కేవలం యోగీ ప్రభుత్వం నిర్మించలేదు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం సమయంలోనే 60 శాతానికి పైగా పనులు జరిగాయి.