‘కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను’ అని పేపర్ లో ఇచ్చిన ప్రకటనని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ ప్రకటనని ప్రముఖ తెలుగు వార్తా సంస్థ TV9 కూడా ప్రచురించింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను’- న్యూస్ పేపర్ ప్రకటన.
ఫాక్ట్ (నిజం): ఇది నిజమైన ప్రకటన కాదు. fodey.com అనే ఒక వెబ్సైటు ద్వారా ఈ హాస్యభరితమైన ప్రకటన తయారు చేసారు. సావియో ఫిగ్యురెడో అనే ఫేస్‌బుక్ యూసర్, ప్రజలను కరోనా వాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించడానికి తనే ఇలా ఆన్లైన్ లో ఒక హాస్యభరితమైన ప్రకటన తయారు చేసానని ప్రకటించాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇదే న్యూస్ పేపర్ క్లిప్ ని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ కూడా ట్విట్టర్ లో షేర్ చేసారు. ఐతే శశి థరూర్ ట్వీట్ కింద చాలా మంది ఇది నిజమైన పేపర్ క్లిప్ కాదని, దీనిని ఆన్లైన్ ఆప్స్ ద్వారా క్రియేట్ చేసారని కామెంట్స్ చేసారు.
ఈ కామెంట్స్ ఆధారంగా FACTLY కూడా fodey.com అనే ఒక గ్రాఫిక్ వెబ్సైటులోని టూల్స్ ద్వారా ఇలాంటి ఒక న్యూస్ పేపర్ క్లిప్ ని తయారు చేసింది, కాని మేము తయారు చేసిన క్లిప్ లో ‘కోవిషీల్డ్’ కి బదులు ‘కోవాక్సిన్’ అని టైపు చేసాము.
పైగా ఈ క్లిప్ లో పెళ్లి ప్రకటన పక్కని పారా లో ప్రతీ లైన్ లోని మొదటి అక్షరాలూ పోస్టులో ఉన్న క్లిప్ లోని పారా మొదటి అక్షరాలూ ఒకేలా ఉండడం చూడొచ్చు. దీన్నిబట్టి వైరల్ అయిన క్లిప్ ఈ వెబ్సైటు నుండే క్రియేట్ చేసి ఉండొచ్చని అర్ధం చేసుకోవచ్చు. ఈ వెబ్సైటులో ఒక స్టాండర్ టెంప్లేట్ ఉండడం వల్ల ఇలా పక్క పారాలో ఒకే విధమైన అక్షరాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి బట్టి వైరల్ అయిన క్లిప్ నిజమైన ప్రకటన కాదని, కేవలం డిజిటల్ గా క్రియేట్ చేసిందని అర్ధం చేసుకోవచ్చు.
సావియో ఫిగ్యురెడో అనే ఫేస్‌బుక్ యూసర్, ప్రజలను కరోనా వాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించడానికి తనే ఇలా ఆన్లైన్ లో ఒక హాస్యభరితమైన ప్రకటన తయారు చేసానని, అది వైరల్ కావడంతో తనకు చాలా కాల్స్ వస్తున్నాయని ఫేస్‌బుక్ లో పోస్టు చేసాడు. వైరల్ అయిన క్లిప్ లోని మొబైల్ నెంబర్ ని ట్రూకాలర్ లో చెక్ చేయగా ఈ నెంబర్ సావియో ఫిగ్యురెడో తో కనిపిస్తుంది. ఈ ఆధారాలతో ఈ వైరల్ క్లిప్ ని సావియో ఫిగ్యురెడో తయారు చేసి ఉండొచ్చని అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, ‘కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను’- ఇది నిజమైన ప్రకటన కాదు.