అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సయ్యద్ సలావుద్దీన్ 1987లో కాంగ్రెస్ పార్టీ తరపున MLA గా పోటి చేసాడని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సయ్యద్ సలావుద్దీన్ 1987లో కాంగ్రెస్ పార్టీ తరపున MLA గా పోటి చేసాడు.
ఫాక్ట్(నిజం): ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ECI) సమాచారం ప్రకారం 1987లో జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సయ్యద్ సలావుద్దీన్ అలియాస్ మహమ్మద్ యూసుఫ్ షా శ్రీనగర్ లోని ‘అమిరకడల్’ నియోజికవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటిచేసి ఓడిపోయాడు. పైగా ECI సమాచారం ప్రకారం ఈ నియోజికవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అసలు పోటి చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
సయ్యద్ సలావుద్దీన్ గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా వికీపీడియాలో ఉన్న సమాచారం ప్రకారం అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ షా అని తెలిసింది. ఇతను కాశ్మీర్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ అయిన Hizb-ul-Mujahideen కి నాయకుడు.
1987 వ సంవత్సరం జమ్మూకాశ్మీర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొహమ్మద్ యూసుఫ్ షా 1987లో శ్రీనగర్ లోని ‘అమిరకడల్’ నియోజికవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటిచేసి ఓడిపోయాడు. పైగా ECI సమాచారం ప్రకారం ఈ నియోజకవర్గం నుండి అసలు కాంగ్రెస్ పార్టీ పోటి చేయలేదు.
ఐతే 26 జూన్ 2017న అమెరికా ప్రభుత్వం సయ్యద్ సలావుద్దీన్ ని ఒక ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ గా గుర్తించింది. ఈ వార్తని ద్రువీకరిస్తు రాజ్యసభలో భారత విదేశాంగ మంత్రి ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఇక్కడ చూడొచ్చు. అమెరికా ప్రభుత్వం ఒక వ్యక్తినిగాని లేదు ఒక సంస్థనిగాని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ లేదా ‘టెర్రరిస్ట్ సంస్థ’ గా గుర్తించినప్పుడు అమెరికాలో ఉన్న ఆ వ్యక్తి లేదా సంస్థ యొక్క ఆస్తులు జప్తు చేయబడతాయి. పైగా వీరితో ఆర్ధిక లావాదేవీలు జరపడం నిషిద్ధం. అంతేకాకుండా, ఈ హోదా ఇతర దేశాలలో ఆర్థిక నిషేధ చట్టాల అమలులో సహాయపడుతుంది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.
నవంబర్ 2019లో ED (Enforcement Directorate) కాశ్మీర్ లోని సలావుద్దీన్ కి చెందిన ఆస్తులని జప్తు చేసింది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు.
చివరగా, సయ్యద్ సలావుద్దీన్ (మహమ్మద్ యూసుఫ్ షా) 1987 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేయలేదు.