Fake News, Telugu
 

జూన్ 2025లో ఉక్రెయిన్ రష్యాపై చేసిన డ్రోన్ దాడి వీడియో అంటూ ఒక వీడియో గేమ్ దృశ్యాలను షేర్ చేస్తున్నారు

0

01 జూన్ 2025న ఉక్రెయిన్ రష్యాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేసింది. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పేరుతో జరిగిన ఈ దాడిలో రష్యాకి చెందిన కొన్ని యుద్ధ విమానాలు, ఎయిర్ బేసులు ధ్వంసం అయినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ దాడికి సంబంధించిన దృశ్యాలంటూ డ్రోన్లు యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 01 జూన్ 2025న రష్యాలోని సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినప్పటి దృశ్యాలు.

ఫాక్ట్: 01 జూన్ 2025న రష్యాలోని సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిన విషయం నిజమే. అయితే వైరల్ వీడియో ఈ దాడికి సంబంధించినది కాదు. ఇవి ‘Arma 3’ అనే వీడియో గేమ్ నుంచి సేకరించిన దృశ్యాలు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని (ఆర్కైవ్) ‘UWC’ అనే యూట్యూబ్ ఛానెల్లో 01 జూన్ 2025న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. 40 రష్యన్ యుద్ధ విమానాలు ఉక్రెయిన్ దాడిలో ధ్వంసం చేయబడ్డాయనే అర్థంతో ఈ వీడియో శీర్షిక ఉంది. అయితే, ఈ వీడియో ‘Arma 3’ అనే వీడియో గేమ్ కు చెందినదని వీడియో వివరణలో పేర్కొన్నారు. అలాగే ఈ వీడియో కేవలం వినోదం కోసమే రూపొందించినట్లు పేర్కొనబడింది.

A screenshot of a video game  AI-generated content may be incorrect.

ఇక ఈ యూట్యూబ్ ఛానల్‌ని పరిశీలించగా, Arma 3 వీడియోలని ఉపయోగించి రూపొందించిన మరిన్ని కల్పిత యుద్ధ వీడియోలను (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) మేము గుర్తించాం. అలాగే, ఈ ఛానెల్లోని వీడియోలన్నీ కల్పితమని, నిజమైన సంఘటనలకు సంబంధించినవి కావని ఛానెల్ వివరణలో స్పష్టం చేశారు.

ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ కు సంబంధించి వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రసారం చేసిన దృశ్యాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కూడా వైరల్ వీడియోకు భిన్నంగా ఉన్నాయి.

చివరిగా, జూన్ 2025లో ఉక్రెయిన్ రష్యాపై చేసిన డ్రోన్ దాడి వీడియో అంటూ ఒక వీడియో గేమ్ దృశ్యాలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll