Fake News, Telugu
 

G20 సదస్సు కోసం ఇటీవల భారత్‌కు విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు హిందూ దేవలయాలతో పాటు ఇస్లామిక్ స్మారక కట్టడాలను కూడా సందర్శించారు

0

G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ఇటీవల భారత్‌ దేశానికి విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు, అక్షర్‌ధామ్, ఇస్కాన్ మందిరం, సూర్య మందిరం మరియు నలందా యూనివర్సిటీలను సందర్శించారే గాని, ఎవరూ కూడా తాజ్‌మహల్ ప్రస్తావన తీయలేదంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: G20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటీవల భారత్‌ దేశానికి విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు తాజ్‌మహల్‌తో సహా ఇస్లామిక్ స్మారక కట్టడాలను వేటినీ సందర్శించలేదు.

ఫాక్ట్ (నిజం): G20 సమావేశాలలో భాగంగా భారత్‌కు విచ్చేసిన అర్జెంటీనా, టర్కి, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల అధినేతలు, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, కుతుబ్ మీనార్‌లతో సహా పలు ఇస్లామిక్ స్మారక కట్టడాలను కూడా సందర్శించారు. G20 సమావేశాల కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడి కొడుకు 09 సెప్టెంబర్ 2023 నాడు తాజ్‌మహల్‌ను సందర్శించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, G20 సమావేశాలలో భాగంగా భారత్‌కు విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు, మరియు వారి కుటుంబ సభ్యులు, హిందూ దేవాలయాలతో పాటు ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, కుతుబ్ మీనార్‌లతో సహా పలు ఇస్లామిక్ స్మారక కట్టడాలను సందర్శించినట్టు తెలిసింది.

ఢిల్లీలోని హుమాయూన్ టాంబ్ కట్టడం తాజ్‌మహల్‌ కన్నా అద్భుతంగా మరియు అందంగా ఉందని అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్ పేర్కొన్నట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌తో రిపోర్ట్ చేశారు. అలాగే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ కుతుబ్ మీనార్‌ను సందర్శించి, అక్కడి అద్భుత శిల్ప చెక్కడాలను చూసి ప్రభావితులయ్యారని, వాటిని పరిరక్షిస్తున్న పురావస్తుశాఖ అధికారులని మెక్రాన్ ప్రశంసించారని తెలిసింది.

G20 సమావేశాల కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడి కొడుకు తాజ్‌మహల్‌ను 09 సెప్టెంబర్ 2023 నాడు సందర్శించారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్క మరియు ఇక్కడ చూడవచ్చు. G20 సమావేశాల కోసం భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 10 సెప్టెంబర్ నాడు అక్షర్‌ధామ్ దేవాలయాన్ని సందర్శించారు. గతంలో G20 ప్రతినిధులు నలందా యూనివర్సిటీని కూడా సందర్శించారు.

చివరగా, G20 సమావేశాల కోసం ఇటీవల భారత్‌కు విచ్చేసిన వివిధ దేశాల నాయకులు దేశంలోని ఇస్లామిక్ స్మారక కట్టడాలను కూడా సందర్శించారు.

Share.

About Author

Comments are closed.

scroll