వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, కొందరు వ్యక్తులు కాషాయ జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ రాత్రివేళ వీధుల్లో తిరుగుతున్న ఒక పెద్ద ర్యాలీని చూపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాజస్థాన్ నుండి 10 వేల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు బెంగాల్ చేరుకున్నారు’ అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: వక్ఫ్ చట్టం వ్యతిరేక నిరసనల నేపథ్యంలో బజరంగ్ దళ్ సభ్యులు రాజస్థాన్ నుండి పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 06 ఏప్రిల్ 2025న పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో జరిగిన రామ నవమి ర్యాలీకి చెందినది. దీనికి, ముర్షిదాబాద్ హింసకి సంబంధం లేదు. కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోను వెరిఫై చేయడానికి, మేము అందులోని కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, 06 ఏప్రిల్ 2025న అరూప్ బిశ్వాస్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఇదే వీడియో మాకు లభించింది.
బెంగాలీ భాషలో ఉన్న పోస్టు వివరణను తెలుగులోకి తర్జుమా చేసి చూడగా, ఇది పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో జరిగిన రామ నవమి ర్యాలీకి చెందినది వీడియో అని మాకు అర్థం అయ్యింది. 11 ఏప్రిల్ 2025న ముర్షిదాబాద్‌లో ప్రారంభమైన వక్ఫ్ సంబంధిత హింసకు ఐదు రోజుల ముందు, 06 ఏప్రిల్ 2025న బరాసత్‌లో జరిగిన రామ నవమి ర్యాలీకి చెందిన వీడియో ఇది అని మనకు దీని ద్వారా అర్థం అవుతుంది.
ఈ విషయాన్ని ధృవీకరించడానికి, మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, బరాసత్‌తో సహా, పశ్చిమ బెంగాల్ అంతటా పలు ప్రదేశాల్లో 06 ఏప్రిల్ 2025న కలకత్తా హైకోర్టు అనుమతితో పోలీసు భద్రతలో రామ నవమి వేడుకలు జరిగాయని తెలుపుతున్న అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.
వార్తా కథనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్‌హాట్‌లో బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి రామనవమి ఊరేగింపుకు నాయకత్వం వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా ఇందులో పాల్గొన్నారు. పట్టణంలోని కీలక ప్రాంతాల గుండా సాగిన ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు.

ఆ తర్వాత, వైరల్ వీడియోని తీసిన ప్రదేశాన్ని గుర్తించడానికి, మేము వైరల్ వీడియోను సరిగ్గా పరిశీలించగా, అందులో ఒకచోట రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్, కెనరా బ్యాంక్ బోర్డు కనిపించడాన్ని మేము గమనించాము. దీని ఆధారంగా, మేము Google Mapsలో బరాసత్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్, కెనరా బ్యాంక్ కోసం వెతకగా, ఇవి రెండూ ఒకే భవనంలో ఉన్నాయని కనుగొన్నాము.
ఈ ప్రదేశం యొక్క Google Street Viewని మేము చూడగా, కొంచెం పాతదైన మ్యాప్‌లో, ఇంకా నిర్మాణంలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ మాకు కనిపించింది. అలాగే, కెనరా బ్యాంక్ బోర్డు కూడా మాకు కనిపించింది. అలాగే వీడియోలో కనిపిస్తున్న నీలిరంగు బోర్డు ఉన్న భవనం, దానికి సమీపంలో ఉన్న భవనాన్ని Google Street Viewలో చూడగా, ఈ ప్రదేశం బరాసత్ అని మాకు స్పష్టం అయ్యింది.

అదనంగా, ఇదే క్లేయిముపై పశ్చిమ బెంగాల్ పోలీస్ వారి సైబర్ వింగ్, 19 ఏప్రిల్ 2025న వారి అధికారిక ‘X’ హ్యాండిల్ ద్వారా ఒక వివరణ ఇచ్చారు. వైరల్ క్లెయిమ్ ఫేక్ అని, బరాసత్‌లో జరిగిన రామనవమి ఊరేగింపుకు చెందిన వీడియోని, రాజస్థాన్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వస్తున్న బజరంగ్ దళ్ సభ్యుల ర్యాలీ దృశ్యాలని అని తప్పుగా షేర్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

అలాగే, వైరల్ వీడియోలో కనిపిస్తున్నటువంటి ర్యాలీని ఇటీవల నిర్వహించినట్లు లేదా పశ్చిమ బెంగాల్‌కు వెళుతున్నట్లు రుజువు చేసే ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు.
చివరగా, రాజస్థాన్ నుండి బెంగాల్‌కు చేరుకున్న బజరంగ్ దళ్ సభ్యుల వీడియోని,బరాసత్ రామనవమి ర్యాలీ యొక్క దృశ్యాలను తప్పుగా షేర్ చేస్తున్నారు.