ఖాళీ సమాధులతో ఉన్న స్మశాన వాటిక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగిందని, థాయ్‌లాండ్‌లోని ప్రతి స్మశానవాటికలో మృతదేహాలు రాత్రికి రాత్రి మాయం అయ్యాయని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని తనిఖీ చేద్దాం.
క్లెయిమ్: థాయ్‌లాండ్‌లోని స్మశాన వాటికలో మృతదేహాలు రాత్రికి రాత్రి అదృశ్యమయ్యాయి.
ఫ్యాక్ట్ (నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు తజికిస్థాన్‌కు చెందినవి. 2019 సెప్టెంబరులో తజికిస్థాన్‌లోని కొనిబోడోమ్ జిల్లాలో ఉన్న షుర్కుర్గోన్ గ్రామంలో సంభవించిన ఒక వరద కారణంగా అక్కడ ఉన్న స్మశానవాటికలో ఈ దుస్థితి చోటుచేసుకొంది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
థాయ్‌లాండ్‌లోని స్మశానవాటికల్లో మృతదేహాలు కనిపించకుండా పోయాయో లేదో అని తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేసి వెతికాము. కానీ, ఈ క్లైముని నిరూపించే విశ్వసనీయమైన వార్తా కథనాలు ఏవీ మాకు దొరకలేదు.
ఇంకా, వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను కనుగొనడానికి, మేము Yandexలో కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, రేడియో ఫ్రీ యూరప్/ రేడియో లిబర్టీ ఇంక్‌కి చెందిన తాజిక్ సర్వీస్ జూన్ 2019లో అప్‌లోడ్ చేసిన YouTube వీడియో ఒకటి దొరికింది(ఇక్కడ , ఇక్కడ). ఈ వీడియోలో వైరల్ వీడియోలో లాంటి విజువల్స్ ఉన్నాయి. వీడియో వివరణ ప్రకారం, ‘భారీ వరదల కారణంగా కొనిబోడోమ్‌లోని షుర్కుర్గాన్ గ్రామంలోని స్మశానవాటికలో సమాధులు పూర్తిగా మునిగిపోయాయి.’ ఈ సంఘటన జూన్ 2019లో తజికిస్తాన్లో జరిగింది.
ఇంటర్నెట్‌లో మరింత సమాచారం కోసం వెతకగా, ఇదే సంఘటనపై, YouTubeలో ఏసియా-ప్లస్ TV ప్రచురించిన మరో నివేదిక దొరికింది. ఇందులో కోనిబోడోమ్‌లో భారీగా దెబ్బతిన్న స్మశానవాటిక దృశ్యాలు ఉన్నాయి. వరద కారణంగా అనేక సమాధులు విరిగిపోయాయి అని ఈ నివేదిక పేర్కొనింది.
చివరిగా, తజికిస్థాన్‌లోని ఒక గ్రామంలో వరదకారణంగా స్మశానవాటికలో గుంతలు ఏర్పడ్డ వీడియోని థాయ్‌లాండ్‌లో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.