Fake News, Telugu
 

FATF పాకిస్తాన్‌ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చలేదు, అది ఇంకా గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతుంది

0

‘FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పాకిస్థాన్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పాకిస్థాన్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

ఫాక్ట్ (నిజం): ఇటీవల 19 -21 అక్టోబర్ 2021 మధ్య FATF ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లోకి అదనంగా టర్కీ, జోర్డాన్ మరియు మాలి దేశాలను చేర్చగా, బోట్స్వానా, మారిషస్ దేశాలను గ్రే లిస్ట్‌లో నుండి తొలగించారు. బ్లాక్ లిస్టులో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు, ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే ఈ లిస్టులో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF):

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ (తీవ్రవాదులకు నిధులు అందించడం) మొదలైనవి నియంత్రించేందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి స్థాపించబడిన ఒక ఇంటర్ గవర్నమెంట్ సంస్థ. దీనిని జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించారు.

బ్లాక్ లిస్ట్:

మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కి సహాకరిస్తూ, వీటిని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని దేశాలను బ్లాక్ లిస్ట్ కింద పరిగణిస్తారు. దీనినే ‘High-Risk Jurisdictions subject to a Call for Action’ అని కూడా అంటారు. ఈ లిస్టులోని దేశాలలో  మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌ని ఎదురుకోనేందుకు అమలు చేస్తున్న విధానాలలో చాలా వ్యూహాత్మక లోపాలను ఉన్నట్టు అర్ధం. బ్లాక్‌లిస్ట్ చేయబడిన దేశాలు, FATF సభ్య దేశాలు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల నుండి తీవ్రమైన ఆర్ధిక ఆంక్షలు ఎదురుకొనే అవకాశం ఉంది.

ఐతే FATF తరచూ రివ్యూ చేస్తూ ఈ బ్లాక్ లిస్టుని అప్డేట్ చేస్తూ ఉంటుంది. FATF ప్రమాణాలు పాటిస్తూ, ఆయా దేశాలలో విధానాలను అమలును బట్టి ఈ లిస్టుని అప్డేట్ చేస్తూ ఉంటారు. మొదటిసారిగా FATF 2000లో 15 దేశాలను బ్లాక్ లిస్ట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్ మరియు నార్త్ కొరియా మాత్రమే బ్లాక్ లిస్టులో ఉన్నాయి.

గ్రే లిస్ట్:

దీనినే ‘Jurisdictions under Increased Monitoring’ అని కూడా అంటారు.  మనీలాండరింగ్ , టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలను గ్రే లిస్ట్‌లోకి చేరుస్తుంది. FATF ఏదైనా దేశాన్ని గ్రే లిస్ట్‌లోకి చేర్చిందంటే ఆ దేశంలో మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌ని అరికట్టేందుకు అమలవుతున్న విధానాలోని లోపాలను FATF నిర్దేశించిన కాల వ్యవధిలో సవరించుకోవడానికి అంగీకరించినట్టు అర్ధం. గ్రే లిస్ట్‌లోని దేశాలు కూడా FATF సభ్య దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుండి ఆర్ధిక ఆంక్షలు ఎదురుకొనే అవకాశం ఉంది.

FATF తరచూ రివ్యూ చేస్తూ ఈ బ్లాక్ లిస్టుని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి FATF 23 దేశాలను గ్రే లిస్ట్‌లోకి చేర్చింది. జూన్, 2018లో మొదటిసారిగా FATF పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్‌లో చేర్చగా, అప్పటినుండి అది గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతూ వస్తుంది.

ఇటీవల 19 -21 అక్టోబర్ 2021 మధ్య FATF ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌ని అరికట్టేందుకు వివిధ దేశాలు అమలు చేస్తున్న విధానాలను రివ్యూ చేసారు. ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తూ తీర్మానం చేయగా, బోట్స్వానా ఇంకా మారిషస్ దేశాలను గ్రే లిస్ట్‌లో నుండి తొలగించారు.

ఐతే ఈ గ్రే లిస్ట్‌లో అధనంగా టర్కీ, జోర్డాన్, మాలి దేశాలను చేర్చారు. టర్కీకి సంబంధించి గ్రే లిస్ట్‌లో నుండి బయటపడాలంటే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కి సంబంధించిన కేసుల విచారణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఎనిమిది టెక్నికల్ అంశాలపై FATF సూచించిన విధానాలను అమలు చేయాలని తెలిపింది. బ్లాక్ లిస్టులో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు, ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే ఈ లిస్టులో ఉన్నాయి.

చివరగా, FATF పాకిస్తాన్‌ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చలేదు, అది ఇంకా గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll