Fake News, Telugu
 

మార్ఫ్ చేసిన ఫోటోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మతో పాటు ఎమ్మెల్సీ కవిత ఫోటోని ప్రదర్శించిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు

0

దుబాయ్ బుర్జ్ ఖలీఫా భవనంపై బతుకమ్మ చిత్రాలతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోటోని ప్రదర్శించిన దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రాలతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఫోటోని ప్రదర్శించిన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. 23 అక్టోబర్ 2021 నాడు దుబాయ్‌ లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ‘బతుకమ్మ’ పండగ వైభవాన్ని ప్రదర్శించారు. బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోలో బతుకమ్మ చిత్రాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలని, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ నినాదాలని ప్రదర్శించారు. కాని, ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఫోటోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

23 అక్టోబర్ 2021 నాడు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం తెరపై తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండగ వీడియోని ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియోని దుబాయ్ బుర్జ్ ఖలీఫా తెరపై ప్రదర్శించారు. ఈ ప్రదర్శన లైవ్ వీడియోని కవిత తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోలో బుర్జ్ ఖలీఫా భవనంపై బతుకమ్మ చిత్రాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ నినాదాలని ప్రదర్శించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ లైవ్ వీడియోని ‘ETV Bharat’ న్యూస్ సంస్థ కూడా తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఈ వీడియోలో కవిత ఫోటోని ఎక్కడా ప్రదర్శించలేదు.

బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ బతుకమ్మ పండగ వైభవాన్ని ప్రదర్శించిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోటోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించినట్టు ఈ వార్తా సంస్థలు ఎక్కడా పేర్కొనలేదు. బుర్జ్ ఖలీఫా , కవిత యొక్క వేర్వేరు ఫోటోలని ఎడిట్ చేసి పోస్టులోని ఫోటోని రూపొందించారని ఈ వివరాల ఆధారంగా చెప్పవచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ చిత్రాలతో పాటు కవిత ఫోటోని ప్రదర్శించిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll