Fake News, Telugu
 

అశోకుడి కాలం నాటి చిహ్నాల్లో కూడా నోరు తెరిచి కోరలు కనిపించేలా ఉన్న సింహాలు ఉన్నాయి

0

ఇటీవల కొత్త పార్లమెంట్ భవనంపై భారీ జాతీయ చిహ్నాన్ని  ప్రధాని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త పార్లమెంట్ భవనంపై పెట్టిన జాతీయ చిహ్నాన్ని అశోకుడి కాలం నాటి చిహ్నంతో పోలుస్తూ, సోషల్ మీడియాలో ఇలా రాస్తున్నారు – “నిజమే, ఇవి సైలెంట్ సింహాలు కాదు… Roaring Lions… గర్జిస్తున్నాయ్…ఇది అశోకుడి కాలం కాదు కదా”. పోస్ట్‌లో రెండు ఫోటోలు కూడా ఉన్నట్టు చూడవచ్చు – ఒక ఫొటోలోని జాతీయ చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నట్టు ఉంటే, కొత్త పార్లమెంట్ భవనంపై తీసిన ఫోటోలో సింహాల నోర్లు తెరిచి ఉన్నట్టు చూడవచ్చు. పోస్ట్‌లో చేసిన  క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అశోకుడి కాలం నాటి చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక జాతీయ చిహ్నంలో సింహాల నోర్లు తెరిచి ఉండేలా మార్చారు. 

ఫాక్ట్: జాతీయ చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నట్టు ఉన్న పోస్ట్‌లోని ఫోటో కర్ణాటక అసెంబ్లీపై ఉన్న జాతీయ చిహ్నానికి సంబంధించింది. అశోకుడి కాలం నాటి చిహ్నాల్లో కూడా నోరు తెరిచి కోరలు కనిపించేలా ఉన్న సింహాలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం రాకముందు నుండే ఉన్న ‘The State Emblem of India (Prohibition of Improper Use) Act, 2005’లో ఇచ్చిన జాతీయ చిహ్నం ఫోటోలో కూడా సింహాల నోర్లు తెరిచి ఉన్నట్టు చూడవచ్చు. కావున, పోస్ట్‌ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లోని రెండు ఫోటోలు ఎక్కడివో మొదటిగా చూద్దాం. జాతీయ చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నట్టు ఉన్న ఫోటో కర్ణాటక అసెంబ్లీపై ఉన్న జాతీయ చిహ్నానికి సంబంధించింది, అశోకుడి కాలంలో నిర్మించిన విగ్రహం కాదు. పోస్ట్‌లో సింహాల నోర్లు తెరిచి ఉన్నట్టు ఉన్న ఫోటో కొత్త పార్లమెంట్ భవనంపై తీసినది. అశోకుడి సారనాథ్‌ నాలుగు సింహాల కాపిటల్ (విగ్రహం) నుండి మన జాతీయ చిహ్నం రూపొందించారు.

అశోకుడి కాలం నాటి చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నాయా?

అశోకుడి సారనాథ్‌ నాలుగు సింహాల కాపిటల్ (విగ్రహం)కు సంబంధించిన ఫోటోలు చూడగా, అందులోని సింహాలు కూడా నోరు తెరిచి కోరలు కనిపించేలా ఉన్నట్టు చూడవచ్చు. దానికి సంబంధించిన వివిధ ఫోటోలు మరియు వీడియోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు  ఇక్కడ చూడవచ్చు. అశోక స్తంభాల గురించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చదవచ్చు. 

అశోకుడి ఇతర స్థంభం పై ఉన్న మరో సింహం నోరు కూడా తెరిచి కోరలు కనిపించేలా ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి, అశోకుడి కాలం నాటి అన్నీ చిహ్నల్లో సింహాలు నోరు మూసుకొని ఉన్నాయని చెప్పడం సరి కాదు.

మోదీ ప్రభుత్వం వచ్చాక జాతీయ చిహ్నంలో సింహాల నోర్లు తెరిచి ఉన్నట్టు మార్చారా?

మోదీ ప్రభుత్వం రాకముందు నుండే ఉన్న ‘The State Emblem of India (Prohibition of Improper Use) Act, 2005’లో ఇచ్చిన జాతీయ చిహ్నం ఫోటోలో సింహాల నోర్లు తెరిచి ఉన్నట్టు చూడవచ్చు.

పోస్ట్‌లో పెట్టిన ఫోటో కింది నుండి తీసినది, మరియు పార్లమెంట్ భవనంపై పెట్టినది భారీ చిహ్నం. కాబట్టి, సింహాల నోర్లు ఎక్కువగా తెరిచి ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ, ముందు నుండి తీసిన ఫోటో చూస్తే, అవి అశోకుడి సింహాల చిహ్నాల మాదిరిగానే ఉన్నట్టు గమనించవచ్చు. అయితే, మెటీరియల్ మరియు హస్తకళల దృక్కోణంలో, భారతదేశంలో మరెక్కడా పార్లమెంట్ మీద ఆవిష్కరించిన చిహ్నానికి సారూప్యమైనది లేదని ఒక అధికారి తెలిపినట్టు ‘ది ఎకనామిక్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది.

పార్లమెంట్ భవనంపై పెట్టిన చిహ్నంలోని సింహాలు కోపంగా కనిపిస్తూ, అన్నీ మింగేసాలా కనిపిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించినట్టు ‘ది హిందూస్తాన్ టైమ్స్’ ఆర్టికల్ ప్రచురించింది. అయితే, అలా కోరలు కనిపించేలా ఉన్న సింహాలతో ఇంతకు ముందు వివిధ ప్రదేశాల్లో పెట్టిన జాతీయ చిహ్నాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు.

చివరగా, అశోకుడి కాలం నాటి చిహ్నాల్లో కూడా నోరు తెరిచి కోరలు కనిపించేలా ఉన్న సింహాలు ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll