Fake News, Telugu
 

యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను స్వదేశానికి తరలించారు

0

సూడాన్ అంతర్యుద్ధం కారణంగా ఆ దేశంలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులని స్వదేశానికి తరలించేందుకు ‘ఆపరేషన్ కావేరి’ ని ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో, యూపీఏ ప్రభుత్వ హయాంలో సంక్షోభ సమయాల్లో విదేశాలలో చిక్కుకున్న భారతీయులని రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.  

క్లెయిమ్: సంక్షోభ సమయాల్లో విదేశాలలో చిక్కుకున్న భారతీయులని రక్షించేందుకు యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

ఫాక్ట్: యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా సంక్షోభ సమయాల్లో విదేశాలలో చిక్కుకున్న భారతీయాలకు తరలించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదాహరణకు 2006లో ‘ఆపరేషన్ సుకూన్’ పేరుతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా 1836 మంది భారతీయాలని లెబనాన్ నుంచి తరలించారు. అలాగే 2011లో ‘ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్’ ద్వారా లిబియాలో ఉన్న దాదాపు 16,200 మంది భారతీయులని భారత ప్రభుత్వం రక్షించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు చేపట్టిన కార్యక్రమాల గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలను పరిశీలించగా, గతంలో కూడా భారత్ ఇటువంటి రక్షణ చర్యలను చేపట్టినట్లు తెలిసింది. వాటిలో కొన్ని క్రింద చూడవచ్చు.

ఆపరేషన్ సుకూన్ (2006): 2006 జూలై-ఆగస్టులలో ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ సమయంలో, INS ముంబై యుద్ధనౌక ద్వారా  భారతీయ నావికాదళం బీరుట్ నౌకాశ్రయంలోకి ప్రవేశించి 1836 మంది భారతీయులను, 65 మంది నేపాలీయులను, 433 మంది శ్రీలంక పౌరులతో సహా ఇతర జాతీయులను అక్కడి నుంచి తరలించింది. వారిని ఓడల ద్వారా సైప్రస్‌లోని లర్నాకాకు తరలించి, అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానాల ద్వారా భారత్‌కు తరలించారు.  

ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ (2011):2011 సంవత్సరంలో అనేక తరలింపు కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. లిబియాలో పరిస్థితి క్షీణించడంతో, భారతదేశానికి తిరిగి రావాలనుకునే దాదాపు 16,200 మంది భారతీయులను లిబియా నుంచి తరలించారు. ఇంకా, అవాంతరాల దృష్ట్యా యెమెన్ నుండి కూడా 698 మంది భారతీయ పౌరులను తరలించడం జరిగింది.

అలాగే, 2013 డిసెంబర్లో దక్షిణ సూడాన్ దేశంలో తలెత్తిన సంక్షోభం కారణంగా అక్కడ చమురు క్షేత్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులను భారత ప్రభుత్వం స్వదేశానికి తరలించింది. గత రెండు దశాబ్దాల కాలంలో భారత్ చేపట్టిన ముఖ్యమైన తరలింపు కార్యక్రమాల పూర్తి వివరాలను ఈ వ్యాసంలో చూడవచ్చు.

చివరిగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా సంక్షోభ సమయాల్లో విదేశాలలో చిక్కుకున్న భారతీయాలకు తరలించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు.

Share.

About Author

Comments are closed.

scroll