Fake News, Telugu
 

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ‘నా మీద ఒక యాదవ కుక్కను నిలబెట్టిండు కేసీఆర్ ’, అని ఈటల రాజేందర్ అనలేదు

0

బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో “నా మీద ఒక యాదవ కుక్కను నిలబెట్టిండు కేసీఆర్”, అని అన్నట్టు రిపోర్ట్ చేసిన ‘దిశ’ వార్త పత్రిక క్లిప్ లాగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కుల సమ్మేళనం సభలో ఈటల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గంలో 10 వేల జనాభా కలిగి ఉన్న గొల్ల, కురుమ కుల సంఘాల ఓట్లు తనకు అక్కర్లేదని చెప్పినట్టు ఈ వార్త పత్రికలో రిపోర్ట్ చేసారు. హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో, ఈ వార్త కథనం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో నిజమెంతో చూద్దాం.

క్లెయిమ్: ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో “నా మీద ఒక యాదవ కుక్కను నిలబెట్టిండు కేసీఆర్”, అని అన్నట్టు ‘దిశ’ వార్త సంస్థ కథనం పబ్లిష్ చేసింది.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో షేర్ చేసిన వార్త కథనాన్ని ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదు. ‘దిశ’ న్యూస్ సంస్థ ఈ క్లిప్ పై స్పష్టతనిస్తూ, ‘దిశ పత్రిక పేరుతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఫేక్ క్లిప్లను క్రియేట్ చేసి రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’, అని తెలిపింది. హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎంపికైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని ‘కేసీఆర్ బానిస’గా పోలుస్తూ ఇటీవల ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసారు. కాని, పోస్టులో చెప్తున్నట్టు ఈటల రాజేందర్ శ్రీనివాస్ యాదవ్‌ని కుక్కతో పోల్చలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదని తెలిసింది. ఒకవేళ ఈటల రాజేందర్ హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని పలు న్యూస్ ఛానల్స్, వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఏ ఒక్క వార్తా సంస్థ ఆర్టికల్ గాని వీడియో గాని పబ్లిష్ చేయలేదు.

పోస్టులో షేర్ చేసిన దిశ వార్త పత్రిక క్లిప్‌కు సంబంధించిన వివరాల కోసం వెతకగా, తమ సంస్థకు ముడి పెడ్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వార్త క్లిప్‌ గురించి ‘దిశ’ న్యూస్ సంస్థ స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. ‘దిశ పత్రిక పేరుతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఫేక్ క్లిప్‌ను క్రియేట్ చేసి వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో తిప్పుతూ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని దిశ పత్రిక యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది’, అని దిశ న్యూస్ సంస్థ తెలిపింది. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన వార్త క్లిప్‌ని దిశ పత్రిక ప్రచురించలేదని స్పష్టమయ్యింది.

పోస్టులో షేర్ చేసిన ఈటల రాజేందర్ బహిరంగ సభ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ఈటెల రాజేందర్ 11 ఆగష్టు 2021 నాడు తన ట్విట్టర్ హేండిల్లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటో హుజురాబాద్ మధువని గార్దెన్స్‌లో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశంలో తీసినట్టు తన ట్వీట్లో తెలిపారు. హుజురాబాదులో నిర్వహించిన కుల సమ్మేళనం సమావేశం దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈటల రాజేందర్ ఈ సమావేశంలో “హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాపై ఒక బీసీ బిడ్డను పోటీలో దింపుతున్నారు. అభ్యర్థి ఎవరైనా కావొచ్చు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కావాల్సింది ఒక బానిస మాత్రమే’, అని తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘ఈనాడు’ వార్త సంస్థ ఆర్టికల్‌ పబ్లిష్ చేసింది. ఈ సమావేశంలో గొల్ల, కురుమ కుల సంఘాల ఓట్లు తనకు అక్కర్లేదని ఈటల రాజేందర్ ఎక్కడా అనలేదు.

చివరగా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ‘నా మీద ఒక యాదవ కుక్కను నిలబెట్టిండు కేసీఆర్ ’, అని ఈటల రాజేందర్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll