Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపిస్తున్న కంప్యూటర్/ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేసింది అమెరికా/నాటో సిబ్బంది, తాలిబన్లు కాదు

0

‘తాలిబాన్ ఉగ్రవాదులు కాబూల్ నగరంలో ప్రవేశించిన తర్వాత చేసిన మొదటి పని ఇంటర్నెట్‌ను డిస్‌కనెక్ట్ చేయడం’ అని చెప్తూ చెత్త బుట్టలు విరిగిన కంప్యూటర్/ఎలక్ట్రానిక్ పరికరాలతో నిండి ఉన్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తాలిబాన్లు కాబుల్ నగరంలో ప్రవేశించిన తర్వాత ఇంటర్నెట్‌ను ధ్వంసం చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): తాలిబాన్లు కాబుల్ నగరంలో ప్రవేశించిన నేపథ్యంలో కాబుల్ పట్టణంలోని అమెరికన్ ఎంబసీ, నాటో దళాలు తమ కార్యాలయాలను విడిచి వెళ్ళే ముందు తమకి చెందిన సమాచారం కలిగిన కంప్యూటర్/ ఎలక్ట్రిక్ పరికరాలను, ఆయుధాలను ధ్వంసం చేసేసాయి. ఈ వీడియోలో కనిపిస్తున్నది కూడా అలా అమెరికా/నాటో సిబ్బంది ధ్వంసం చేసిన పరికరాలతో నిండిపోయిన చెత్త బుట్టలే. వీడియోలో కనిపిస్తున్న పరికరాలను ధ్వంసం చేసింది తాలిబన్లు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

15 ఆగస్ట్ 2021 ప్రాంతంలో తాలిబన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో కాబుల్ లోని నాటో దళాలు, అమెరికన్ ఎంబసీ సిబ్బంది తమకి చెందిన సమాచారం, ఆయుధాలు మొదలైనవి తాలిబాన్ల చేతిలో పడకుండా వాటిని ధ్వంసం చేసేసారు. పోస్టులోని వీడియోలో కూడా ఈ నేపథ్యానికి సంబంధించిందే. వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈ వీడియోలో కనిపిస్తున్నది కాబుల్ లోని నాటో కార్యాలయం వెనకాల ఇలా ధ్వంసం చేసిన పరికరాలతో నిండిపోయిన చెత్త బుట్టలు.

పైగా యుఎస్ ఎంబసీని రాకెట్, మోటార్ దాడుల నుండి కాపాడే సి-ర్యామ్ అనే రక్షణ వ్యవస్థని కూడా ఎంబసీ సిబ్బంది తగలబెట్టారని ఈ కథనంలో పేర్కొన్నారు.  ఇవే వీడియోలను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ ప్రచురించిన కథనంలో కాబూల్‌లోని యుఎస్ ఎంబసీ సిబ్బందికి అక్కడి నుండి తిరిగి వచ్చే ముందు అన్ని సున్నితమైన సమాచారాన్ని వదిలించుకోవాలని ఆదేశాలందాయని న్యూయార్క్ పోస్ట్ రాసింది.

ఐతే గతంలో తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ లోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసినప్పటికీ, ఇటీవల తాలిబన్లు కాబుల్ పట్టణాన్ని ఆక్రమించుకున్న తరవాత నగరంలోని ఇంటర్నెట్ వ్యవస్థని ధ్వంసం చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలైతే లేవు.

చివరగా, ఈ వీడియోలో కనిపిస్తున్న కంప్యూటర్/ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేసింది అమెరికా/నాటో సిబ్బంది, తాలిబన్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll