అసెంబ్లీ సాక్షిగా కాశ్మీర్ పండితులను తూలనాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై జాతీయవాదులు దాడి చేసి అతని ఇంటి గేటుపై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అని పెయింట్ వేసిన దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. “‘ది కాశ్మీర్ ఫైల్స్’ అబద్దం కాదు, ఒక భయంకరమైన నిజం”, అని ఒక ఇంటి గేటుపై ఎరుపు రంగుతో పెయింట్ చేసిన దృశ్యాన్ని మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేజ్రీవాల్ ఇంటి గేటుపై జాతీయవాదులు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అక్షరాలని పెయింట్ చేసిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. 1990లో కాశ్మీర్ పండిట్లపై ఎటువంటి మారణకాండ జరగలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో పేర్కొన్నాడని ఆరోపిస్తూ బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇంటి గేటుపై బీజేపీ కార్యకర్తలు ఎరుపు రంగుతో పెయింటింగ్ వేసారు. కానీ, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే అక్షరాలను ఈ గేటుపై పెయింట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం వెతికితే, ఎరుపు రంగుతో పెయింట్ చేసి ఉన్న ఇదే గేటు ఫోటోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు రాఘవ్ చద్దా 30 మర్చి 2022 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. బీజేపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేసిన దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. కాని రాఘవ్ చద్దా షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో ఎరుపు రంగు పెయింట్ చేసి ఉన్న గేటుపై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అక్షరాలు రాసి లేవు. ఈ ఒరిజినల్ ఫోటోని ‘ది హిందూ’ వార్తా సంస్థ కూడా తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసింది.
1990లో కాశ్మీర్ పండిట్లపై ఎటువంటి మారణకాండ జరగలేదని అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో పేర్కొన్నాడని ఆరోపిస్తూ బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు 30 మర్చి 2022 నాడు అరవింద్ కేజ్రివాల్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉన్న బారికేడ్లను ద్వంసం చేసి, సీసీటీవీ కెమెరాలను పగలకొట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ దాడికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసారు. కేజ్రీవాల్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి ప్రత్యేక సిట్ (SIT) విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ సురబ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు.
చివరగా, బీజేపీ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి గేటుపై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అక్షరాలని పెయింట్ చేసినట్టు ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తున్నారు.