Fake News, Telugu
 

2018లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

స్వాతి మలివాల్ అనే మహిళ ఢిల్లీలో గత ఎనమిది రోజులుగా రేప్ చేసిన వారిని ఉరితీయాలంటూ నిరాహార దీక్ష చేస్తుంది అని, ఈ దీక్షను మీడియా చూపించడంలేదు అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: స్వాతి మలివాల్ అనే మహిళ గత ఎనమిది రోజులుగా, రేప్ చేసిన వారిని ఉరితీయాలంటూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో ఉన్నది సామాజిక కార్యకర్త, ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ (DCW) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్. ఇది 2018లో కతువా, ఉన్నావ్‌లలో జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో ఆమె,  లైంగిక హింస, నేరాలకు సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ చేసిన నిరాహార దీక్ష చేసినప్పటి దృశ్యం. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లైముకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే ఈ ఫోటో  2018లో కతువా, ఉన్నావ్‌లలో జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో జరిగిన సంఘటనలది అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).  ఈ దృశ్యం 2018లో సామాజిక కార్యకర్త, ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ (DCW) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ భారతదేశంలో మహిళలపై లైంగిక హింస, నేరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కఠినమైన చట్టాలు మరియు మరింత సమర్థవంతమైన చర్యల కోసం 2018లో నిరాహార దీక్ష చేసినప్పటిది.

ఈ నిరాహారదీక్ష యొక్క ముఖ్యమైన ఫలితాలలో ఒకటి క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2018 ప్రవేశపెట్టడం. ఈ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ అఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) మరియు POCSO చట్టంలోని నేరాలకు సంబంధించి ముఖ్యమైన మార్పులను తెచ్చింది.

  • మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి కనీస శిక్షను ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచేందుకు ఈ బిల్లు ఐపీసీ, 1860ని సవరించింది.
  • 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారం మరియు సామూహిక అత్యాచారం చేస్తే కనీసం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది, జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించబడుతుంది.
  • లైంగిక నేరాల కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. 
  • 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఇరవై ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది.

చివరిగా, 2018లో ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ (DCW) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చేసిన నిరాహార దీక్ష ఫోటోలను ఇప్పటి ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll