Fake News, Telugu
 

హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం అర్హత ఉండదని ‘Constitution (Scheduled Castes) Order,1950’ లోనే ఉంది

0

తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిందని, ఇస్లాం మరియు క్రైస్తవం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లకు అనర్హులని పార్లమెంట్ లో కేంద్రం వివరణ ఇచ్చిందని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన. ఇస్లాం మరియు క్రైస్తవం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లకు అనర్హులని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన కేంద్రం.

ఫాక్ట్: ‘Constitution (Scheduled Castes) Order,1950’ లోని ‘para 3’ ప్రకారం హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం (SC) అర్హత ఉండదని రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒక ప్రశ్నకి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంచలన ప్రకటన చేయలేదు; కేవలం పాత చట్టంలో ఉన్న విషయాల గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. కావున, పోస్ట్ లో ‘సంచలన ప్రకటన’ అని చెప్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఈ విషయం పై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ గత నెల రాజ్యసభ లో మాట్లాడినట్టు తెలిసింది. ‘Constitution (Scheduled Castes) Order, 1950’ లోని ‘para 3’ ప్రకారం హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం (SC) అర్హత ఉండదని 11 ఫిబ్రవరి 2021న రాజ్యసభలో ఒక ప్రశ్నకు రవిశంకర్‌ ప్రసాద్ సమాధానమిచ్చారు.

ఇస్లాం లేదా క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు ఎస్సీ రిజర్వు సీటు నుండి పోటీ చేయడానికి అనర్హులని స్పష్టంగా పేర్కొంటూ ఎన్నికల నియమాలల్లో సవరణ చేయడానికి ప్రభుత్వం పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ, ‘ప్రస్తుతానికి అటువంటి ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదు’, అని రవిశంకర్‌ ప్రసాద్ తెలిపారు. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంచలన ప్రకటన చేయలేదు; కేవలం పాత చట్టంలో ఉన్న విషయాల గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు.

క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని కోరుతూ ఇంతకముందు కొందరు సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. అది ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

చివరగా, హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం అర్హత ఉండదని ‘Constitution (Scheduled Castes) Order,1950’ లోనే ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll