‘మనిషికి కేవలం మనిషి గుండెనే కాదు గోవు గుండెను కూడా అమర్చవచ్చు అని, చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో ఓ వృద్ధురాలికి గోవును గుండెను అమర్చారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘మనిషికి కేవలం మనిషి గుండెనే కాదు గోవు గుండెను కూడా అమర్చవచ్చు అని, చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో ఓ వృద్ధురాలికి గోవును గుండెను అమర్చారు’.
ఫాక్ట్ (నిజం): 2015లో చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో కేవలం ఆవు గుండె టిష్యూ (కణజాలం) నుండి తయారు చేసిన బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని మాత్రమే అమర్చారు, పూర్తిగా మనిషి గుండె స్థానంలో ఆవు గుండెని కాదు. సాధారణంగా గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ కి సంబంధించి మెకానికల్ లేదా బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని వాడుతుంటారు. పైగా ఈ బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని పంది, గుర్రం, మనిషి యొక్క గుండె టిష్యూ నుండి కూడా తయారు చేస్తారు. గతంలో కూడా భారతదేశంలో ఇలా బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని అమర్చిన సందర్భాలున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
2015లో చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో గుండెకి సంబంధించిన వాల్వ్ సన్నబడుతున్న సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి కేవలం ఆవు గుండె టిష్యూ (కణజాలం) నుండి తయారు చేసిన బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని మాత్రమే అమర్చారు. అంతేగాని పోస్టులో చెప్తున్నట్టు పూర్తిగా మనిషి గుండె స్థానంలో ఆవు గుండెని అమర్చలేదు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఆవు గుండె టిష్యూ నుండి తయారు చేసిన వాల్వ్‌ని మనిషి గుండెకి అమర్చిన ఈ వార్తని మనిషి గుండె స్థానంలో ఆవు గుండెని అమర్చినట్టు తప్పుగా అర్ధం చేసుకొన్నారని తెలుస్తుంది.
సాధారణంగా గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ కి సంబంధించి మెకానికల్ లేదా బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని వాడుతుంటారు. 1952లో మొదటిసారిగా మనిషి గుండెకి కృత్రిమంగా తయారు చేసిన వాల్వ్‌ని అమర్చగా, 1990లో బయో ప్రోస్తెటిక్ వాల్వ్ వినియోగంలోకి వచ్చాయి. భారత దేశంలో కూడా గతంలో ఇలా మనిషికి టిష్యూస్ తో తయారు చేసిన బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని అమర్చినట్టు ఈ కథనాల (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా అర్ధమవుతుంది.
సాధారణంగా మెకానికల్ వాల్వ్‌ని కార్బన్, టైటానియం వంటి పదార్థాలతో తయారు చేస్తారు. అదే బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని ఆవు గుండె చుట్టూ ఉండే టిష్యూస్ (కణజాలం) నుండి తయారు చేస్తారు. అదేవిధంగా పంది, గుర్రం, మనిషి యొక్క గుండె టిష్యూ వాల్వ్ నుండి కూడా తయారు చేస్తారు. ఐతే మెకానికల్ లేదా బయోలాజికల్ వాల్వ్‌లో ఏది వాడలో పేషెంట్ యొక్క వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. ఏ వయసువారికి ఎలాంటి వాల్వ్‌ని అమరిస్తే ఉపయోగమో, ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి వాల్వ్‌ని వాడితే మంచిదో స్టాన్‌ఫొర్డ్ యూనివర్సిటీ, ఇతర సంస్థలు రీసెర్చ్ చేసిన స్టడీ ఇక్కడ చూడొచ్చు. మెకానికల్, బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌కి సంబంధించి మరికొంత సమాచారం ఇక్కడ చూడొచ్చు.
ఆవు మరియు మనిషి గుండె యొక్క స్ట్రక్చర్ మరియు అనాటమీ ఒకేలా ఉన్నప్పటికీ, మనిషి గుండె (పురుషులది 300 గ్రాములు, మహిళలది 200 గ్రాములు) బరువుంటుంది. కాని ఆవు గుండె మాత్రం సుమారు 2.25 కిలోల బరువుంటుంది, కాబట్టి సాంకేతికంగా మనిషి గుండె స్థానంలో ఆవు గుండెని అమర్చడం సాధ్యం కాదు.
చివరగా, మనిషి గుండె స్థానంలో ఆవు గుండెని అమర్చలేము, కేవలం ఆవు గుండె చుట్టూ ఉండే టిష్యూస్ ద్వారా బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని తయారు చేస్తారు.