మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో GDP వృద్ది రేట్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మొదలైన వాటిని మోదీ ప్రభుత్వ హయాంలో ఉన్న వాటితో పోలుస్తూ ఈ ఇండికేటర్స్ లో మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మోదీ హయాంతో పోలిస్తే మన్మోహన్ సింగ్ హాయాంలోనే పలు సూచిలలో మంచి గణాంకాలు నమోదయ్యాయి.
ఫాక్ట్(నిజం): పోస్టులో ప్రస్తావించిన సూచిలలో తమకు అనుకూలంగా కేవలం మన్మోహన్ సింగ్ హయాంలో అనుకూలంగా ఉన్న గణాంకాలను , మోదీ హయాంలో అంతగా అనుకూలంగా లేని గణాంకాలతో పోల్చారు. మోదీ హాయాంలో కూడా GDP వృద్ది ఒక ఏడాది 8% నమోదైంది. అలాగే 2009 ప్రారంభంలో రూ. 45.62గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర 2014 ప్రారంభానికి రూ. 71.52 అయింది. అలాగే లీటర్ డీజిల్ ధర 2009 ప్రారంభంలో రూ. 32.86 కాగా అదే 2014 ప్రారంభానికి రూ. 53.78 కి చేరుకుంది. ఇలా పలు అంశాలలో కేవలం మోదీ హయాంలో ఎక్కువగా ఉన్న గణాంకాలను మాత్రమే ప్రస్తావించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
GDP వృద్ది రేటు:
మన్మోహన్ సింగ్ హయాంలో 9% GDP వృద్ది సాధించిన మాట నిజమైనప్పటికి కాంగ్రెస్ పాలించిన ప్రతీ సంవత్సరం GDP వృద్ది రేటు అదే విధంగా లేదు. రిజర్వు బ్యాంకులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2019-20 తాత్కాలిక అంచనాల ప్రకారం GDP వృద్ది రేటు 4.18 గా అంచనా వేయగా , 2020-21 లో GDP 7.7 % క్షీణిస్తుందని అంచనా వేసారు. ఐతే మోదీ ప్రధానిగా ఉన్న అన్ని సంవత్సరాలు ఇలా GDP వృద్ది తక్కువ నమోదు కాలేదు, మోదీ ప్రభుత్వ హయాంలో కూడా GDP అత్యధికంగా 2016-17లో 8.26% వృద్ది రేటు సాధించింది. కాబట్టి, తమకు అనుకూలంగా ఉన్న సంవత్సరాల GDP మాత్రమే పోల్చారు.
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:
మన్మోహన్ సింగ్ హయాంలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. 2009 ప్రారంభంలో రూ. 45.62గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర 2014 ప్రారంభానికి రూ. 71.52 అయింది. అలాగే లీటర్ డీజిల్ ధర 2009 ప్రారంభంలో రూ. 32.86 కాగా అదే 2014 ప్రారంభానికి రూ. 53.78 కి చేరుకుంది. అదేవిధంగా మోదీ హాయాంలో ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పోస్టులో చెప్పినట్టు అధికంగా ఉన్నప్పటికీ మోదీ హాయాం మొత్తం ఇవే రేట్లు లేవు. PPAC వెబ్సైటులో పెట్రోల్ ధరలకి సంబంధించి ఉన్న సమాచారం ప్రకారం 2017 జూలై లో లీటర్ పెట్రోల్ ధర రూ. 63 కాగా, లీటర్ డీజిల్ రూ. 53 గా ఉండేది. సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడిచమురు ధరలు, డాలర్ మారకం విలువ, ప్రభుత్వ పన్నులు వంటి చాలా అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ టైం లో ఉన్న ధరలను మోదీ టైంలో ఉన్న ధరలతో ఇవేవి ప్రస్తావించకుండా పోల్చడం కరెక్ట్ కాదు. కాకపోతే, ముడి చమురు ధర ఇప్పుడు చాలా తగ్గినా, పెట్రోల్ & డీజిల్ ధరలు ప్రభుత్వ పన్నుల కారణంగా ఎక్కువగా ఉన్న మాట నిజమే.
రైల్వే ప్లాట్ ఫారం టికెట్ ధర:
కోవిడ్-19 నేపధ్యంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒక దగ్గర చేరకురదనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో పది రూపాలున్న రైల్వే ప్లాట్ ఫారం టికెట్ ని కొన్ని స్టేషన్లలో రూ. 50కి పెంచారే తప్ప దేశంలోని అన్ని స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ రూ.50 గా లేదు. పెరిగిన రేట్లు రాబోయే జూలై వరకు అమలులో ఉంటాయని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచీ)
2020 సంవత్సరానికి గాను 107 దేశాలకి సంబంధించి విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత దేశ ర్యాంకు 94 గా ఉంది. 2016 కి ముందు ర్యాంకులు రూపొందించే పద్ధతి వేరేగా ఉన్న నేపథ్యంలో ర్యాంకులు కేటాయించడానికి ఆధారమైన స్కోర్ పరిగణలోకి తీసుకోగా 2000వ సంవత్సరంలో 38.9 గా ఉన్న భారత దేశ స్కోర్ 2020లో మెరుగుపడి 27.2 కు చేరుకుంది. (తక్కువ స్కోర్ అంటే మంచిది). దీన్ని బట్టి భారత దేశం హంగర్ ఇండెక్స్ లో మెరుగుపడుతుందని అర్ధమవుతుంది. కాకపోతే ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశ ర్యాంకు మెరుగ్గా లేదు. అంతే కాదు, అప్పుడు ఇంకా ఇప్పుడు ర్యాంకులు ఇచ్చే పద్ధతి ఒక్కటి కాదు కాబట్టి పోల్చడం కరెక్ట్ కాదు.
SSC ఉద్యోగ ఖాళీలు:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL, CHSL,ఢిల్లీ పోలీస్ మొదలైన పలు ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది, పోస్టులో SSC నిర్వహించే ఏ సెలక్షన్ అనేది స్పష్టంగా తెలపనందున కేవలం CGL నియామకాలను పరిగణలోకి తీసుకోగా, SSC వెబ్సైటులో అందుబాటు ఉన్న సమాచారం ప్రకారం CGL –2020లో మొత్తం 7035 పోస్టులకి పరీక్ష నిర్వహించారు. 2019లో మొత్తం 8539 పోస్టులకు పరీక్ష నిర్వహించగా, 2018లో 11271 పోస్టులకి పరీక్ష నిర్వహించారు. ఐతే ఇటివల కాలంలో ప్రతీ ఏడాది ఈ పరీక్షకి సంబంధించి ఖాళీలు తగ్గుతున్నాయి, 2013లో మొత్తం 15,146 పోస్టులకి పరీక్షా నిర్వహించగా, 2014లో 15,549 పోస్టులకి నిర్వహించారు. ఐతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హాయాంతో పోలిస్తే మోదీ హాయాంలో ఈ పోస్టుల సంఖ్య తగ్గిన మాట నిజమే. దీనికి కచ్చితమైన కారణం చెప్పలేం, ఎందుకంటే సాధారణంగా వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీల ఆధారంగా పరీక్ష నిర్వహిస్తుంటారు.
పైన తెలిపిన సూచిలలో మన్మోహన్ సింగ్ హయాంలో తమకు అనుకూలంగా ఉన్న గణాంకాలను , మోదీ హయాంలో అంతగా అనుకూలంగా లేని గణాంకాలతో పోలుస్తున్నారని అర్ధమవుతుంది.
చివరగా, కేవలం మన్మోహన్ సింగ్ హయాంలో అనుకూలంగా ఉన్న గణాంకాలను , మోదీ హాయాంకి అంతగా అనుకూలంగా లేని గణాంకాలతో పోలుస్తున్నారు.