Fake News, Telugu
 

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 328 స్థానాల్లో పోటీ చేస్తోంది

0

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 230 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిపింది, ఒక పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 272 సీట్లు కావాలి, కాంగ్రెస్ అన్ని సీట్లు గెలుచుకున్నా సొంతంగా అధికారంలోకి రాలేదు, అలాంటప్పుడు వారు ప్రకటించిన హామీలు ఎలా అమలు చేస్తారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 230 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది.

ఫాక్ట్(నిజం): 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 33 జాబితాలలో మొత్తం 328 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ 400 కంటే తక్కువ స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ క్లెయిమ్ గురించి సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 328 స్థానాల్లో పోటీ చేస్తుంది అని తెలుపుతున్న పలు మీడియా రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ వార్త కథనాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 400 కంటే తక్కువ సీట్లలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 421 స్థానాల్లో పోటీ చేసింది. 2014లో 464 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. 2009లో కాంగ్రెస్ పార్టీ 440 సీట్లకు పోటీ చేసింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది. భారత చరిత్రలో సంకీర్ణ ప్రభుత్వాల శకం అని పిలువబడే 1989 మరియు 1999 మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ 450 సీట్లకు పైగా పోటీ చేసింది. అలాగే, కాంగ్రెస్ పార్టీ 2019లో 52 సీట్లు, 2014లో 44 సీట్లు, 2009లో 206 సీట్లు , 2004లో 145 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల I.N.D.IA కూటమిలో భాగం అయినందున 2019లో పోటీ చేసిన సుమారు101 సీట్లును 2024 సార్వత్రిక ఎన్నికల్లో I.N.D.IA కూటమి భాగస్వాములకు పొత్తులో భాగంగా ఇచ్చింది.

తదుపరి మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కోసం వెతకగా, కాంగ్రెస్ పార్టీ 33 జాబితాలలో మొత్తం 328 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిసింది. కొన్ని జాబితాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 230 స్థానాల్లో కన్న ఎక్కువగా 328 స్థానాల్లో పోటీ చేస్తుందని మనం నిర్థారించవచ్చు.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంఖ్యను దిగువ చూడవచ్చు.

చివరగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 328 స్థానాల్లో పోటీ చేస్తోంది.

Share.

About Author

Comments are closed.

scroll