Fake News, Telugu
 

సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు, వారి నామినేషన్లు తిరస్కరించారు

0

ప్రస్తుతం జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇటీవల జిల్లా ఎన్నికల అధికారి సూరత్ పార్లమెంట్ నియోజికవర్గంలో BJP అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించు కోవడంతోనే BJP అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని ఈ వార్త సారాంశం. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమెంటో చూద్దాం.  

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సూరత్ నియోజికవర్గంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతోనే BJP అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

ఫాక్ట్(నిజం): సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు, వారిని ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు నామినేషన్‌ పేపర్స్‌లో సంతకం చేసింది మేము కాదని జిల్లా ఎన్నికల అధికారికి అఫిడవిట్ అందించడంతో నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల సూరత్ పార్లమెంట్ నియోజికవర్గానికి BJP అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది నిజమే అయినప్పటికీ, ఇలా జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం కాదు. నిజానికి నామినేషన్ వేసిన ఇండిపెండెంట్లు మరియు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆలా చేయలేదు.  

ఈ విషయానికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వెతకగా సూరత్ నియోజికవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి కుంభానీ నీలేశభాయ్ మరియు సురేశ్‌భాయ్ పద్సాల వేసిన నామినేషన్‌లు తిరస్కరించబడ్డాయని తెలిసింది. అలాగే పోటీలో ఉన్న పలువురు ఇండిపెండెంట్‌లు మరియు కొన్ని ఇతర చిన్న పార్టీల నుండి పోటీలో నిలబడ్డ వారు తమ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.

కాగా వార్తా కథనాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి కుంభానీ నీలేశభాయ్ నామినేషన్‌ను ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు నామినేషన్‌ పేపర్స్‌లో సంతకం చేసింది మేము కాదని జిల్లా ఎన్నికల అధికారికి అఫిడవిట్ అందించడంతో నీలేశభాయ్ నామినేషన్ తిరస్కరించబడింది (ఇక్కడ & ఇక్కడ). ఈ విషయానికి సంబంధించి ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నుండి సమాధానం కోరినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్‌భాయ్ పద్సాల నామినేషన్‌ను కూడా ఎన్నికల అధికారి ఇదే కారణం చేత తిరస్కరించినట్టు కథనాలు రిపోర్ట్ చేసాయి. దీన్నిబట్టి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ కావడం, ఇతరులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడం వల్ల జిల్లా ఎన్నికల అధికారి BJP అభ్యర్థి ముఖేష్ దలాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు స్పష్టమవుతుంది. ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే BJP  నుండి నామినేషన్ వేసిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరించబడింది.

చివరగా, సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు, వారి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. 

Share.

About Author

Comments are closed.

scroll