రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికాయిత్, ముస్లింల సానుభూతి పొందడానికి ‘అల్లా హు అక్బర్’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఒక బహిరంగ సభలో రాకేశ్ టికాయిత్ ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేస్తుంటే, అదే బహిరంగ సభలో ఉన్న హిందూ రైతులు, కోపంతో ‘హర హర మహాదేవ’ నినాదాలు చేసారంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ ముస్లింల సానుభూతి కోసం ‘అల్లా హు అక్బర్’ అంటే హిందూ రైతులు ఆగ్రహంతో ‘హరహార మహదేవ్’ నినాదాలు చేసారు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 05 సెప్టెంబర్ 2021 నాడు ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ సమావేశంలో రాకేశ్ టికాయిత్ ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేసిన మాట వాస్తవం. కానీ, రాకేశ్ టికాయిత్ భారత దేశ ఐఖ్యతను తెలుపడానికి తను ‘అల్లాహు అక్బర్’ అంటే ‘హర హర మహాదేవ్’ నినాదాలను చేసేలా రైతులను ప్రేరేపించారు. రైతులు ఆగ్రహంతో ‘హరహార మహదేవ్’ నినాదాలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియో పై ‘Punjab Tak’ న్యూస్ ఛానల్ లోగో కనిపిస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో కోసం ‘Punjab Tak’ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వెతకితే, ఈ వీడియోని ‘Punjab Tak’ న్యూస్ ఛానల్ 05 సెప్టెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 05 సెప్టెంబర్ 2021 నాడు ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.
‘Punjab Tak’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన వీడియోలోని 11:06 నిమిషాల దగ్గర రాకేశ్ టికాయిత్, “ఒకవేళ దేశంలో ఇలాంటి (బీజేపి) ప్రభుత్వాలు కొనసాగితే, వారు దేశంలో నిరంతరంగా అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. గతంలో తికాయిత్ (రాకేశ్ టికాయిత్ తండ్రి మరియు BKU మాజీ అధ్యక్షులు మహేంద్ర సింగ్ టికయిత్) గారి సమయంలో కూడా నినాదాలు చేసేవారు. ‘అల్లాహు అక్బర్’ (వెంటనే బహిరంగ సభలోని జనాలు ‘హర హర మహాదేవ్’ అనే నినాదాలు), ‘అల్లాహు అక్బర్’ (మళ్ళీ బహిరంగ సభలోని జనాలు ‘హర హర మహాదేవ్’ అని నినాదాలు చేసారు). ఈ ‘అల్లాహు అక్బర్-హర హర మహాదేవ్’ నినాదాలు దేశంలో ఇదివరకు చోటుచేసుకున్న ఉద్యమాలలోను చెప్పారు. ఇకముందు జరుగబోయే ఉద్యమాలలో కూడా ఈ నినాదాలు చేస్తూనే ఉంటారు. అల్లర్లు మా దగ్గర చెలరేగవు. వారు ప్రజలని విడదియాలని ప్రయత్నిస్తే, మేము కలుపుకోవాలని ప్రయత్నిస్తాం. ప్రజలు తప్పుడు ప్రచారాలకు మోసపోవద్దు”, అని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్ సమావేశంలో రాకేశ్ టికాయిత్ ప్రసంగిస్తున్న వీడియోని మరికొన్ని న్యూస్ ఛానల్స్ కూడా పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో, రాకేశ్ టికాయిత్ కిసాన్ మహా పంచాయత్ సమావేశంలో ఇచ్చిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి రూపొందించారు.
రాకేశ్ టికాయిత్ ‘అల్లా హో అక్బర్’ నినాదానికి సంబంధించిన పూర్తి స్పష్టతనిస్తూ ‘BBC News Hindi’ 07 సెప్టెంబర్ 2021 నాడు వీడియోని పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో రాకేశ్ టికాయిత్, ముస్లింల సానుభూతి కొరకు ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఎడిట్ చేసిన వీడియోని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ ముస్లింల సానుభూతి కొరకు ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.