Fake News, Telugu
 

ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలో గోవధని ప్రోత్సహిస్తున్నాడని చెప్తూ క్లిప్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

బక్రీద్ సందర్భంగా కర్ణాటకలో ఎవరైనా ఆవులను రక్షించేందుకు వచ్చి, మోరల్ పోలీసింగ్ చేస్తే, తన్ని జైల్లో వెయ్యండని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పోలీసులను ఆదేశిస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన రాష్ట్రంలో గోవధను ప్రోత్సహిస్తున్నాడని మరికొన్ని పోస్టులు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: బక్రీద్ సందర్భంగా కర్ణాటకలో ఎవరైనా ఆవులను రక్షించేందుకు వస్తే వారిని జైల్లో వెయ్యండని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా గోవధను ప్రోత్సహించారు.

ఫాక్ట్: ఈ వీడియో అసంపూర్ణమైనది. పూర్తి వీడియోలో ఆయన గోరక్షకుల పేరుతో చట్టప్రకారం పశువులని రవాణాచేసే వాళ్ళని వేధిస్తున్న వారిపై, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించారు. అలాగే జంతువులని కానీ, పశువులకని కానీ అక్రమ రవాణా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని, బయటి వ్యక్తులు ఈ పనిని చేసి చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా ఆయన మాట్లాడిన విషయం గురించి కన్నడ మీడియా సంస్థలు ప్రసారం చేసిన పూర్తి వీడియోని పరిశీలించాం.

20 జూన్ 2023లో కలబురగిలో జరిగిన సమావేశంలో అధికారులని ఉద్దేశిస్తూ, “త్వరలో బక్రీద్ వస్తోంది.. అందరు పీఎస్‌ఐలు, డీఎస్పీలు జాగ్రత్తగా వినండి. మేము ఈ దళం నుంచి వచ్చాం, ఆ దళం నుంచి వచ్చాం అని కొందరు కండువాలు వేసుకొని వస్తారు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి తెలియదు. ఎవరైనా ఇలా వచ్చి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, వారిని తన్ని జైల్లో వేయండి. సరైన పత్రాలు, అనుమతి గనుక ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాలలో కానీ పశువుల రవాణా అనుమతించబడుతుందని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మీరు చేసే పనిని వారికి ఇచ్చి మీరు స్టేషన్లో ఉండిపోతారా? గత ప్రభుత్వ హయాంలో ఈ కొత్త వేధింపులు మొదలయ్యాయి. గతంలో గుల్బర్గాలో, వీళ్ళు(గో రక్షకులు) ఇళ్ళల్లోకి వెళ్లి రైతుల పశువులను ఎత్తుకెళ్లారు. చట్టం ప్రకారం నడుచుకోండి. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా జంతువులను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటే, అది పశువులు లేదా మరేదైనా జంతువులైనా సరే వారిని జైల్లో పెట్టండి. దీంట్లో సందేహమే లేదు. అయితే అన్ని అనుమతులు పొందిన తర్వాత కూడా ఎవరైనా వేధిస్తున్నట్లయితే, మీరెవరు ఈ పని చెయ్యడానికని మీరు వారిని అడగండి…” అని అన్నారు.

అయితే వైరల్ వీడియోలో ఆయన మాట్లాడిన మొదటి 30 సెకన్లు ప్రసంగాన్ని మాత్రమే షేర్ చేయడంతో, ఆయన చెప్పిన విషయం వక్రీకరించబడింది. ఇక ఇదే వీడియోని బిజేపి కర్ణాటక ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ, ప్రియాంక్ ఖర్గే అక్రమ గోవధను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించగా బిజేపి తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్తూ ఆయన దీన్ని ఖండించారు.

చివరిగా, అసంపూర్ణమైన క్లిప్ చేసిన వీడియోని షేర్ చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే గోవధను ప్రోత్సహిస్తున్నాడని చెప్తూ తప్పుడు ప్రచారం జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll