Fake News, Telugu
 

ఎన్నికల హామీలను నెరవేర్చలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నట్టు ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య “ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో అంటాం ఇప్పుడు ఇవ్వలేము… ఎందుకంటే డబ్బుల్లేవు కాబట్టి…” అని అన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు (ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతునాయి. తమ వాదనకు మద్దతుగా సిద్ధరామయ్య వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో అంటాం, ఇప్పుడు ఇవ్వలేము, ఎందుకంటే డబ్బుల్లేవు – కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

ఫాక్ట్ (నిజం): ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియో. ఈ వ్యాఖ్యలు సిద్దరామయ్య కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ చేయలేదు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకి ఈ వ్యాఖ్యలు ఆపాదించాడు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల హామీల అమలు గురించి మాట్లాడుతూ “గతంలో యడియూరప్పను రుణ మాఫీ గురించి ప్రశ్నించినప్పుడు ‘మా వద్ద ప్రింటింగ్ మెషిన్ ఉందా? మేము డబ్బు ఎక్కడ నుండి పొందాలి? ఎన్నికలకు ముందు మనము ఏదైనా అని ఉండవచ్చు. మనం అప్పుడు ఏది చెప్పినా అనుసరించగలమా?’’ అని అన్నాడని గుర్తుచేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న పూర్తి నిడివి గల వీడియో యూట్యూబ్‌లో లభించింది. ఈ ఆరు గంటల నిడివి గల వీడియోలో, క్లిప్ చేయబడిన భాగాన్ని  టైంస్టాంప్ 4:57:00 మరియు 4:58:30 మధ్య చూడవచ్చు.

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు గురించి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప వాఖ్యలకు ప్రతిస్పందిస్తూ సిద్ధరామయ్య ఇలా అన్నారు ”మీ 2018 మేనిఫెస్టోలో మీరు ఏమి చెప్పారు? అధికారంలోకి వచ్చిన మొదటి మంత్రివర్గంలోనే జాతీయ బ్యాంకు లేదా సహకార బ్యాంకులోని 1 లక్ష వరకు రుణ మాఫీ చేస్తాము అన్నారు. మీరు చేశారా? ఇదే యడియూరప్ప, డిసెంబర్ 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాసన మండలిలో ఉగ్రప్ప రుణాలు మాఫీ చేయమని చేసిన డిమాండ్‌పై స్పందిస్తూ, మా వద్ద ప్రింటింగ్ మెషిన్ ఉందా? మేము డబ్బు ఎక్కడ నుండి పొందాలి? నేను డబ్బు ఎక్కడ నుండి పొందగలను? ఎన్నికలకు ముందు మనము ఏదైనా అని ఉండవచ్చు. మనం అప్పుడు ఏది చెప్పినా అనుసరించగలమా?’’ (కన్నడ నుంచి తెలుగులోకి అనువదించినప్పుడు).

ఈ ప్రసంగంలోని కొంత భాగాన్ని  డిజిటల్‌గా ఎడిట్ చేసి, కేవలం “మా వద్ద ప్రింటింగ్ మెషిన్ ఉందా? మేము డబ్బు ఎక్కడ నుండి పొందాలి? ఎన్నికలకు ముందు మనము ఏదైనా అని ఉండవచ్చు. మనం అప్పుడు ఏది చెప్పినా అనుసరించగలమా?’’ అన్న వాఖ్యలను సిద్దరామయ్య ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో (కాంగ్రెస్ హామీలను నెరవేర్చడంపై) చేసినట్టు చిత్రీకరించారు. 

ఇదే విషయం పై సిద్ధరామయ్య తన అధికారిక X ఖాతాలో స్పందించారు. తన అసెంబ్లీ ప్రసంగం యొక్క ఎడిట్ చేయని వీడియోను పంచుకుంటూ, తాను 2009లో యడియూరప్ప రుణ మాఫీ గురించి చెప్పిన మాటలను ప్రస్తావిస్తున్నానని స్పష్టం చేశారు.

చివరగా, ఎన్నికల హామీలను నెరవేర్చలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నట్టు డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll