Fake News, Telugu
 

చైనా ఆర్టిస్ట్ రూపొందించిన ‘Sky Ladder’ బాణసంచా ప్రదర్శన వీడియోని అయోధ్యలో దీపావళి వేడుక దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

దీపావళి పండగ రోజు దీపాలతో ఆకాశానికి నిచ్చెన వేసిన అయోధ్య వాసులు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. భాణసంచా నిచ్చెన ఆకారంలో వెలుగుతూ ఆకాశం వైపుగా దూసుకెళ్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో దీపావళి పండగ వేడుక దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): నిచ్చెన ఆకారంలో నింగికి దూసుకెళ్తున్న ఈ బాణసంచాని చైనా ప్రముఖ బాణసంచా ఆర్టిస్ట్ కై గ్వో-చంగ్ (Cai Guo-Quiang) రూపొందించారు. ‘Sky Ladder’ పేరుతో పిలిచే ఈ బాణసంచాని కై గ్వో-చంగ్ 15 జూన్ 2015 నాడు చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్స్ లో ప్రదర్శించారు. ఈ వీడియోకి అయోధ్యలో దీపావళి పండగ సంబరాలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కొంత మంది సోషల్ మీడియా యూసర్లు 2015లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. నిచ్చెన ఆకారంలో నింగికి దూసుకెళ్తున్న ఈ బాణసంచాని చైనా ఆర్టిస్ట్ కై గ్వో-చంగ్ (Cai Guo-Quiang) రూపొందించి ప్రదర్శించినట్టు ఈ వీడియోలలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన బాణసంచా వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని చైనా న్యూస్ సంస్థలు CGTV మరియు ‘People’s Daily China’ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. చైనా ప్రముఖ బాణసంచా ఆర్టిస్ట్ కై గ్వో-చంగ్ రూపొందించిన అధ్బుత ‘Sky Ladder’ బాణసంచా దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. 

ఈ ‘Sky Ladder’ బాణసంచా ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కై గ్వో-చంగ్ అధికారిక సోషల్ మీడియా హేండిల్స్‌లో దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కై గ్వో-చంగ్ రూపొందించిన మరికొన్ని ఆర్ట్ వర్క్స్‌ని ఇక్కడ చూడవచ్చు. ఈ ‘Sky Ladder’ బాణసంచాని 15 జూన్ 2015 నాడు చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్స్ లోని హుయుద్వీపం సమీపంలో ప్రదర్శించారు. ‘Sky Ladder’ బాణసంచా ప్రదర్శనకు సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కై గ్వో-చంగ్ రూపొందించిన ఈ ‘Sky Ladder’ బాణసంచాకు సంబంధించి ‘Netflix’ వారు ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించారు.

అయోధ్యలో దీపావళి వేడుకలకి సంబంధించి పబ్లిష్ అయిన ఆర్టికల్స్, వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దీపావళి పండగ సందర్భంగా అయోధ్యలో తొమ్మిది లక్షల దీపాలని వెలిగించినట్టు పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ దీపోత్సవానికి సంబంధించిన ఫోటోలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 03 నవంబర్ 2021 నాడు ట్వీట్ చేసారు. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియో అయోధ్య దీపావళి వేడుకలకి సంబంధించినది కాదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, చైనా ఆర్టిస్ట్ కై గ్వో-చంగ్ రూపొందించిన ‘Sky Ladder’ బాణసంచా ప్రదర్శన వీడియోని అయోధ్యలో దీపావళి వేడుక దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll