Fake News, Telugu
 

నిరాదరణకు గురైన, నిరాశృయులైన పిల్లల సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య మరియు పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్ పథకాల ద్వారా ప్రతి నెల స్టైఫండ్ అందిస్తున్నారు

0

18 సంవత్సరాల లోపు అనాథ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల రూ. 4000 ఆర్ధిక సహాయం అందిస్తుందన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. సమీపంలోని అంగన్‌వాడి టీచర్/CPDOకి వివరాలను అందజేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 18 సంవత్సరాల లోపు అనాథ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల రూ. 4000 ఆర్ధిక సహాయం అందిస్తుంది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన, నిరాదరణకు గురైన/నిరాశృయులైన పిల్లల సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య, పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్ పేర్లతో పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ పథకాల ద్వారా అర్హులైన నాన్-ఇన్స్టిట్యూషనల్ (బంధువులు/గార్డియన్) సపోర్ట్ పొందుతున్న పిల్లలకు మిషన్ వాత్సల్య కింద నెలకు రూ. 4000 స్టైఫండ్ బ్యాంకు ఖాతాలలోకి అందిస్తారు. అదే ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ పొందుతున్న  పిల్లలకు మిషన్ వాత్సల్య కింద నెలకు రూ.3000 కింద ఆయా ఇన్‌స్టిట్యూషన్స్‌కి అందిస్తారు. కావున ఈ పోస్టు ద్వారా చెప్పేది నిజమే.  

తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన, నిరాదరణకు గురైన/నిరాశృయులైన పిల్లల సంరక్షణ కోసం, కరోనాతో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య, పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్ పేర్లతో పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అర్హులైన పిల్లలకు ఈ పథకాల ద్వారా ప్రతీ నెల కొంత స్టైఫండ్ కూడా అందిస్తుంది. ఈ పథకాల గురించి కింద తెలుసుకుందాం.

మిషన్ వాత్సల్య:

కేంద్ర ప్రభుత్వం నిరాదరణకు గురైన/నిరాశృయులైన అనాథ పిల్లలను గుర్తించి వారి విద్య, ఆరోగ్యం, అభివృద్ధి అవసరాలకు ఉపయోగపడేలా ఆర్ధిక సాయం అందించేలా మిషన్ వాత్సల్య పేరుతో ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంను (CSS) రూపొందించింది. ఈ పథకం కింద అయ్యే ఖర్చులను 60:40 నిష్పత్తిలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

అంతకు ముందు 2009 వరకు మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(WCD) నిరాదరణకు గురైన పిల్లల కోసం ‘The juvenile justice programme for children in need of care and protection as well as children in conflict with the law’, ‘The integrated programme for street children’, ‘The scheme for assistance to children’s homes’ పేర్లతో మూడు పథకాలను అమలు చేసేది.

ఐతే 2010లో ఈ మూడు పథకాలను కలిపేసి ‘Integrated Child Protection Scheme’ అని పేరు పెట్టారు. తిరిగి 2017లో ‘Child Protection Services Scheme’ అని, మళ్లీ తిరిగి 2021-22లో మిషన్ వాత్సల్యగా పేరు మార్చారు.

ఈ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా స్పాన్సర్‌షిప్, ఫోస్టర్ కేర్ మరియు ఆఫ్టర్ కేర్ విధానాల ద్వారా బంధువులు దగ్గర లేక ఇతర నాన్-ఇన్‌స్టిట్యూషన్ కేర్‌లలో ఆశ్రయం పొందుతున్న బాధిత పిల్లలకు స్పెషల్ గ్రాంట్ కింద నెలకు రూ. 4000 ఆర్ధిక సహాయం అందజేస్తారు. ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ పొందుతున్న  పిల్లలకు జువెనైల్ జస్టిస్ చట్టం ఆధారంగా సహాయాన్ని అందిస్తారు.

ఈ పథకాన్ని అమలు చేసే పని రాష్ట్ర ప్రభుత్వానిది కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల సహాయంతో (అంగన్‌ వాడీ కేంద్రాలు మొదలైన మండల/గ్రామ స్థాయి సంస్థలతో) పథకాన్ని అమలు చేస్తుంది. పథకానికి దరఖాస్తు చేసుకునే పిల్లలకు జనన ధృవీకరణ పత్రం, ఆధార్, తల్లి ఆధార్, తండ్రి ఆధార్, సంరక్షకుడి ఆధార్, రేషన్ కార్డు, పాస్‌ పోర్ట్‌ ఫోటో, ప్రస్తుతం చదువుతున్న స్టడీ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలతో అంగన్‌ వాడీ కేంద్రాల్లో అందచేయాల్సి ఉంటుంది.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్’ :

కేంద్ర ప్రభుత్వం మే 2021లో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతుగా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్’ అనే పథకాన్ని ప్రకటించింది. కేవలం తల్లితండ్రులు మాత్రమే కాకుండా చట్టపరమైన సంరక్షకులు/దత్తత తీసుకున్న తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు కూడా ఈ పథకం ద్వారా సహాయాన్ని అందిస్తారు.

ఈ పథకం ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమగ్ర రక్షణలో భాగంగా వసతి, విద్యా, స్కాలర్షిప్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఉన్నత చదువులకు సహాయం మరియు 23 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆర్ధికంగా స్వయం సమృద్ధి చెందేలా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో రూ. 10 లక్షల కార్పస్ పెట్టుబడి పెడతారు.

‘పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్’ కింద అర్హులై నాన్-ఇన్స్టిట్యూషనల్ (బంధువులు/గార్డియన్) సపోర్ట్ పొందుతున్న పిల్లలకు మిషన్ వాత్సల్య కింద నెలకు రూ. 4000 స్టైఫండ్ బ్యాంకు ఖాతాలలోకి అందిస్తారు. అదే ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ పొందుతున్న  పిల్లలకు మిషన్ వాత్సల్య కింద నెలకు రూ. 3000 కింద ఆయా ఇన్‌స్టిట్యూషన్స్‌కి అందిస్తారు.

చివరగా, నిరాదరణకు గురైన/నిరాశృయులైన పిల్లల సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య మరియు పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రెన్ పథకాల ద్వారా ప్రతి నెల స్టైఫండ్ అందిస్తున్నారు.

సవరణ (14 April 2023): ఇంతకు ముందు ప్రచురించిన ఈ ఆర్టికల్ లో కేవలం కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్టైఫండ్ అందజేస్తుంది అని తెలిపాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ ని మిషన్ వాత్సల్య పథకం వివరాలతో అప్డేట్ చేయటం జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll